అపరకుభేరుడు, వ్యాపారవేత్త, వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, వ్యామోగామి అయిన రిచర్డ్ బ్రాన్సన్ ఆదివారం రోజు తన వీఎస్‌ఎస్ యూనిటీ-22 వ్యోమనౌకలో అంతరిక్షంలో చక్కర్లు కొట్టి తిరిగి భూమి మీదకు వచ్చారు. సొంత వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లి వచ్చిన మొదటి వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్ చరిత్ర లిఖించారు. అయితే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన జులై 20వ తేదీన రోదసీ వీక్షించి తిరిగి భూమికి చేరుకోనున్నారు. రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్ష టూరిజానికి బాటలు వేశారని చెప్పుకోవచ్చు.
ఐతే రిచర్డ్ బ్రాన్సన్ తో కలసి ఐదుగురు వ్యోమగాములు కూడా వీఎస్‌ఎస్ యూనిటీ-22లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. కాగా.. తాను, తన బృందం మొదటిసారిగా అంతరిక్షంలో పొందిన అనుభవాన్ని రిచర్డ్ బ్రాన్సన్ ఒక వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు ఒక సందేశాన్ని ఇచ్చారు.
"భూమ్మీద ఉన్న పిల్లలందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నా చిన్నతనంలో నేను నక్షత్రాల వైపు చూస్తూ కల కనేవాడిని. ఇప్పుడు, ఆ కల సాకారం చేసుకొని అంతరిక్షం నుంచి నేను మన అందమైన భూమిని చూస్తున్నాను. నా అంతరిక్ష నౌకలో నేనొక్కడినే కాదు ఇతర అద్భుతమైన పెద్దలతో పాటు భూమిని పైనుంచి చూస్తున్నాను. కలలు కనే భవిష్యత్తు తరాల వారి కోసం కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మేమే దీన్ని చేయగలిగితే.. మీరేం చేయగలరో ఒక్కసారి ఊహించుకోండి" అని రిచర్డ్ బ్రాన్సన్ వీడియో లో చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోలో వ్యామోగాములు గాల్లో తేలుతూ కనిపించారు.
అయితే ఈ 32 సెకండ్ల నిడివిగల వీడియోకి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 62 వేల లైకులు వచ్చాయి. ఆయన స్ఫూర్తి దాయకమైన మెసేజ్ పెద్ద కలలు కనే పిల్లలందరిని బాగా ఎంకరేజ్ చేస్తోంది. కృషి ఉంటే ఎంతటి కలలైనా సాకారం చేసుకోవచ్చని ఏడు పదుల వయసున్న రిచర్డ్ బ్రాన్సన్ నిరూపించారు.