చైనా జిత్తుల మారి నక్క అన్న సంగతి తెలిసిందే. చైనా మనకు పక్కలో బల్లెం. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత కూడా చైనా తన నక్క జిత్తులు ప్రదర్శిస్తూనే ఉంది. వాటిని మన సైన్యం తిప్పికొడుతూనే ఉంది. ఓవైపు చర్చలు జరుపుతూనే.. మరోపక్క తన నక్క జిత్తులు ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామని ఓవైపు చెబుతూనే వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలను నిర్మిస్తోంది. భారత్, చైనా వివాదాస్పద ప్రాంతాలకు శర వేగంగా బలగాలను చేర్చేందుకు వీలుగా కాంక్రీట్‌ శిబిరాలను నిర్మిస్తోంది. ఈ చైనా కుట్రలను భారత జాతీయ మీడియా కథనాలు  బయటపెట్టాయి.  


అసలేం జరిగిందంటే.. ఉత్తర సిక్కిం నకులా ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా తమ భూభాగంలో కొన్ని కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టింది. తన భాగంగా కాంక్రీటు నిర్మాణాలు కట్టుకుంటే మనకేం నష్టం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నకులా సెక్టార్‌ అనేది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. గతేడాది భారత్‌, చైనా బలగాలకు ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ ప్రాంతం చాలా దగ్గర. ఇప్పుడు కొత్తగా చైనా కాంక్రీటు నిర్మాణాలు నిర్మిస్తున్న ప్రాంతం ఇక్కడకు చాలా దగ్గర.


ఇలా చైనా కాంక్రీటు నిర్మాణాలు నిర్మించడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్టు కనిపిస్తోంది. వివాదాస్పద ప్రాంతాలకు త్వరగా బలగాలను తరలించడానికి ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. సిక్కింలోనే కాదు.. తూర్పు లద్దాఖ్‌, అరుణాచల్‌ సెక్టార్‌ల వద్ద కూడా చైనా తన ప్రాంతంలో ఇలాంటి అధునాతన భవన నిర్మాణాలు చేపడుతున్నట్టు సమాచారం అందుతోంది. అంతే కాదు.. వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలం పాటు తన సైన్యాన్ని ఉంచే ఉద్దేశ్యంతోనే చైనా ఈ నిర్మాణాలు కడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  


తూర్పు లద్దాఖ్‌ లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల మధ్య ఘర్షణల తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రెండు దేశాల సైనికాధికారులు అనేక దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఇంకా వివాదం పూర్తిగా సమసిపోలేదు. ఇలాంటి సమయంలో చైనా ఇలా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: