కరోనా థర్డ్ వేవ్ భయాల కారణంతో.. స్కూళ్లను తెరవాలా వద్దా అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై స్పందించిన కేంద్రం.. పాఠశాలలను ప్రారంభించడం రాష్ట్రాల ఇష్టమని పేర్కొంది. చిన్నారులపై కోవిడ్ పెద్ద ప్రభావం చూపించకపోవచ్చనీ.. అయితే పిల్లల వ్యాప్తి కారకులుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఉపాధ్యాయులను ప్రయార్టీ గ్రూప్ కింద చేర్చి టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.

ఇక భారత్ లో గడిచిన 24గంటల్లో 43వేల 654కరోనా కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా కోవిడ్ మహమ్మారికి 640మంది బలైనట్టు బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 3లక్షల 99వేల 436యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. అటు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 44.61కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్టు వివరాలు తెలిపింది.

దేశంలో నిర్ధేశించుకున్న లక్ష్యాల ప్రకారమే వ్యాక్సినేషన్ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని తెలిపింది. జులై 31 నాటికి దేశవ్యాప్తంగా 51కోట్ల డోసుల వ్యాక్సిన్ లను పంపిణీ చేసి తీరుతామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. జనవరి-జులై చివరి నాటికి 51.60కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలో ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు దేశీయ టీకా స్ఫుత్నిక్-వి సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో అందుబాటులోకి రావొచ్చని డా.రెడ్డీస్ ప్రకటించింది. రష్యాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నందున.. అక్కడి నుంచి టీకా దిగుమతులు ఆశించినంతగా లేవని పేర్కొంది. అటు టీకా ఉత్పత్తి కోసం రష్యా సంస్థ ఆర్ డీఐఎఫ్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ప్రయోగాత్మక ఉత్పత్తి దశలో ఉన్నాయంది. కాగా మనదేశంలో 25కోట్ల డోసుల స్ఫుత్నిక్-వి టీకా పంపిణీకి డా.రెడ్డీస్ ఒప్పందం పెట్టుకుంది. కరోనా వైరస్ పిల్లలను బాగా ఉపయోగించుకునే ప్రమాదం ఉంది కాబట్టి.. స్కూళ్లకు పిల్లలను పంపించకపోవడమే ఉత్తమమనే వాదన వినిపిస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: