ప్రభుత్వం ఓ మద్యం బాటిల్ కోసం దర్యాప్తు చేయిస్తోంది. దాదాపు రూ.4లక్షల విలువైన మద్యం బాటిల్ ఏమైందో తెలుసుకోవాలని ఆదేశించింది. మరి ఇంతగా దర్యాప్తు చేయిస్తున్నారంటే అదేదో మామూలు మద్యం బాటిల్ కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ మద్యం బాటిల్ విలువ దాదాపు రూ. 4 లక్షలు ఉంటుందట. ఆ బాటిల్ అమెరికాకు జపాన్ గిఫ్ట్‌గా ఇచ్చిందట.
ట్రంప్ హయాంలో మైక్ పాంపియో అమెరికా విదేశాంగమంత్రిగా ఉన్నారు. ఆయన జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు జపాన్ అధికారులు ఓ ఖరీదైన మద్యం బాటిల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ విలువను బట్టి దాని వినియోగం ఉంటుందట. ఒక పరిమితి దాటిన బహుమతులను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అలాంటి ఖరీదైన గిఫ్ట్ కావడంతో ఆ మద్యం బాటిల్‌కు అంత ప్రత్యేకత ఉంది. అయితే ఇటీవల ఆ మద్యం బాటిల్ మాయమైపోయిందట. ఇప్పుడు ఆ బాటిల్ దొంగ ఎవరో తేల్చాలని బైడన్ సర్కారు దర్యాప్తు చేయిస్తోంది.
మైక్ పాంపియో 2019లో జపాన్‌లో పర్యటించారు. అప్పుడే జపాన్ ప్రభుత్వ అధికారులు ఆయనకు 5800 డాలర్ల విలువైన ఈ లిక్కర్ బాటిల్ గిఫ్ట్‌గా ఇచ్చారట. అమెరికా చట్టాల ప్రకారం 390 డాలర్ల కంటే తక్కువ విలువైన బహుమతులను అమెరికా ప్రభుత్వ అధికారులు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటిన వస్తువు బహుమతిగా వస్తే దాన్ని సదరు వ్యక్తి సొంతానికి వాడుకోకూడదు. దానికి అదనంగా డబ్బు కట్టి వాడుకోవాలి.
అయితే రికార్డుల ప్రకారం అప్పటి అమెరికా ప్రభుత్వం ఆ మద్యం బాటిల్‌కు అలా అదనపు సొమ్ము చెల్లించినట్లు రికార్డులు లేవు. మరోవైపు.. మద్యం బాటిల్ కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. విచిత్రం ఏంటంటే.. ఇలాంటి విషయాలపై అంతర్గతంగా విచారణ జరుగుతుంది కానీ.. ఇలా బయటకు ప్రకటించరు. కానీ ఇప్పుడు ఈ మద్యం బాటిల్ విషయం మాత్రం ప్రభుత్వమే వెల్లడించింది. అదీ విశేషం.