ఇక తెలంగాణ రాష్ట్రంలోని 35గురుకుల జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే టీఆర్ జేసీ సెట్ ఈ నెల 14న జరుగనుంది. ఈ నెల 14ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ నెల 9నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష కోసం 39వేల 500మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇక తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే ఉన్నత విద్యామండలి క్లస్టర్ విధానం అమలు చేయనుంది. అంటే డిగ్రీ సీటు ఏకాలేజీలో వచ్చినా నచ్చిన కాలేజీలో చదువు కోవచ్చు. డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం మాత్రమే కల్పించనుండగా.. రాష్ట్రంలో 50కి పైగా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్ గా ఏర్పాటయ్యే కాలేజీల మధ్య సమస్యలు రాకుండా ఒప్పందాలు జరగాలి. ఒక కాలేజీలోని వనరులు మరో కాలేజీవారు వినియోగించుకోవచ్చు.
మరోవైపు జేఈఈ మెయిన్స్ మూడో విడత పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 17మంది 100పర్సంటైల్ సాధిస్తే.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8మంది విద్యార్థులున్నారు. వీరిలో పోలు లక్ష్మీసాయి లోకేశ్ రెడ్డి, మాదుర్ ఆదర్శ్ రెడ్డి, వెలవాలి కార్తికేయ సాయి వైదిక్, జోస్యులవెంకట ఆదిత్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. కరణం లోకేశ్, దుగ్గినేని, ఫణీశ్, పసల వీర శివ, రాహుల్ నాయుడు ఏపీకి చెందినవారు. విద్యార్థులు విశేష ప్రతిభ కనుబరచడం పట్ల వారి తల్లిండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.