మనకు బ్రిటీషు బానిసత్వం నుండి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర సమరయోధులలో కేవలం హిందువులు మాత్రమే కాదు. ఈ గడ్డపై జీవించి ఈ భూమిని తమ తల్లిగా, ఇదే గడ్డ పై నివసిస్తున్న వారందర్నీ వారు సోదరులుగా భావించి వారందరి కోసం బ్రిటీషు వారితో తలపడ్డ ఇతర మతస్థులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది ముస్లిములు కూడా ఉన్నారు. వారి గురించి వారు చేసిన త్యాగాల గురించి ఇపుడు తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం . ఓకే ఒక్క చివరి కోరిక... నా జన్మభూమి మట్టిని కొంచం ఉంచండి చాలు అదే మహా ప్రసాదం. అదిమాత్రమే చాలు..దేశ స్వాతంత్య్రం కోసం ఉరితాడును సంతోషంగా నా మెడకు భిగించుకుంటాను అంటూ భారతదేశ ఆణిముత్యం అమరజీవి అష్ఫాఖుల్లాఖాన్ నోట రాలిన ముత్యాల వంటి మాటలివి. ఈ దేశంలో పుట్టి పెరిగిన ఎంతోమంది ముస్లిములు తమ జన్మ భూమి అయిన భారత దేశాన్ని ఎంతగా ప్రేమిస్తారో, గౌరవిస్తారో చాటి చెప్పడానికి ఇదో ఉదాహరణ. దేశ స్వాతంత్రం కోసం ముస్లిములు సైతం శతాబ్దాలుగా తమ ప్రాణాలకు తెగించి పోరాడారు.

దేశ బహిష్కరణకు గురై తమ కుటుంబ సభ్యులకు దూరమైపోయారు. ఎంతో మంది ముస్లిములు స్వాతంత్రం కోసం పోరాడి చెరసాల పాలయ్యారు. చాలామంది అక్కడే తమ తనువు చాలించారు. తమ జాతి, తమ మతం కాకపోయినప్పటికీ తమ జన్మ భూమిపై జన్మించిన వారందరూ తమ సోదరులేనని భావించి మన కోసం బ్రిటీషులతో  పోరాడి తమ ప్రాణాలను సైతం విడిచారు. వాస్తవానికి దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీషు వారిపై తిరుగుబాటు మొదలు పెట్టింది భారతీయ ముస్లిములే అని చరిత్ర చెబుతోంది. 1750 కాలంలో అలీ వర్దీఖాన్‌, షాహ్ వలియుల్లా, ముహద్దిస్ దహెల్వీ, రహిమహుల్లా లు బ్రిటీషు లపై తిరుగుబాటు ప్రకటించి స్వాతంత్రోద్యమానికి తొలి పునాది వేశారు.1757లో బెంగాల్ పాలకుడైనటువంటి నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి స్వాతంత్య్రోద్యమానికి బలం పెంచాడు. వ్యాపారం పేరుతో వచ్చి, భారతీయులను బానిసలుగా మార్చడానికి పన్నాగాలు పన్నిన ఆంగ్లేయులను మట్టు పెట్టడానికి ఎదురు తిరిగి, సింహ స్వప్నంగా నిలిచాడు.

దీంతో  ఆంగ్లేయులు ఈ స్వతంత్ర పాలకుని అంతం చేయాలని కుట్రపన్ని మీర్ జాఫర్ ద్వారా ద్రోహపూరిత కుట్ర పన్ని  సిరాజుద్దౌలాను హతమార్చారు. అలా సిరాజుద్దౌలా దేశ స్వాతంత్రం కోసం పోరాడి అమరుడయ్యారు. మైసూరు పాలకుడు సయ్యద్ హైదర్ అలీ సైతం తమ జన్మభూమిపై ఎవరి పెత్తనమో ఏంటని ఆంగ్లేయులకు ఎదురుతిరిగాడు. తమ ప్రజలను మాతృభూమిపై స్వేచ్చగా జీవించేలా చేయాలని సంకల్పించి ఆంగ్లేయులతో తలబడ్డాడు. చివరకి తన ప్రాణాలను కోల్పోయారు. అయినా ఈయన  కుమారుడు మహా  పరాక్రమవంతుడు  టిప్పుసుల్తాన్ (1799 ) తండ్రి బాటలో నడిచి ఆంగ్లేయుల అరాచకాలకు వ్యతిరేకత తెలుపుతూ ఎదురు నిలిచాడు. అనంతరం ఈ పోరాటంలో 'టిప్పు' కూడా అమరుడయ్యారు. దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయుల బలగాలతో పరాక్రమంగా పోరాడుతూ, రణరంగంలోనే దేశం కోసం నేలకొరిగిన మొట్ట తొలి దేశభక్తుడిగా టిప్పు సుల్తాన్ చరిత్రలో నిలిచారు.

1817 లో సయ్యద్ అహ్మద్ షహీద్, అల్లామా ఇస్మాయీల్ షహీద్, ఆ తర్వాత మౌలానా అబ్దుల్లాహ్ కసూరి వంటి వారు దేశభక్తితో  దేశ ప్రజలను ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుండి విముక్తులను చేయడానికి ఆంగ్లేయులకు వైరానికి దిగారు. ఇలా ఎందరో ముస్లిములు తమ జన్మ భూమి అయిన భారత దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డారు. ఇలా కొన్ని వందల ఏళ్ల క్రితమే బ్రిటిష్ వారి చెర నుండి తప్పించుకోవడానికి భారతీయులు అందరూ ఎటువంటి మత బేధం లేకుండా కలిసి కట్టుగా తరిమి తరిమి కొట్టారు. అలాంటిది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో కులం మతం పేరుతో వివాదాలు జరుగుతుండడం చాలా విచారించదగ్గ విషయం. ఇకనైనా ఈ విధానం మారాలి..అందరూ కలిసికట్టుగా ఉండి, కష్ట సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అన్నదమ్ముల్లా ఉండాలి. ఇదే భరతమాత కోరుకునేది.  

మరింత సమాచారం తెలుసుకోండి: