తెలంగాణలో దళిత బంధు పథకాన్ని సరిగ్గా హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడిలో ప్రకటించిన కేసీఆర్, ఈటలను దెబ్బకొట్టేందుకే ఈ పథకాన్ని తెరపైకి వచ్చారని విమర్శలు మూటగట్టుకున్నారు. అదే సమయంలో ఆయన హుజూరాబాద్ నుంచే పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించారు. 15 కుటుంబాలకు తానే స్వయంగా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగస్తుల కుటుంబాలు కూడా దళిత బంధుకి అర్హులేనని చెప్పారు కేసీఆర్.
ఉద్యోగులు కనీసం రేషన్ కార్డ్ కి కూడా అనర్హులు. ఇతర ప్రభుత్వ పథకాలేవీ వారికి వర్తించవు. అలాంటిది ఏకంగా రూ.10లక్షలు ఇచ్చే దళిత బంధు పథకానికి ఉద్యోగుల్ని కూడా అర్హులుగా పేర్కొంటూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ముందుగా దళితుల్లో పేదవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటున్న ఆయన, ఆ తర్వాత చివరి వరుసలో ఉద్యోగుల్ని కూడా జత చేరుస్తామంటున్నారు.
దళితబంధు పథకాన్ని ఉద్యోగస్తులకు కూడా వర్తించడంపై నిరుపేద వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది. అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని, అలా చేస్తే ఆర్థిక సాయం దుర్వినియోగం అవుతుందని చెబుతున్నారు. దళిత ఉద్యోగులకు రూ.10లక్షలు ఇచ్చే బదులు, ఇతర సామాజిక వర్గాల్లో నిరుపేదల్ని గుర్తించి సాయం చేయొచ్చు కదా అని సూచిస్తున్నారు. మొత్తమ్మీద ఉద్యోగులకు ఆర్థిక సాయం అంటూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది.