మరోవైపు మరో రెండు నెలల్లో చిన్న పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల చెప్పారు. కొవిడ్-19 వ్యాధి నుంచి రక్షణ కల్పించేలా తయారు చేస్తున్న ఈ టీకా.. 2 నుండి 18ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూశామనీ.. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇమ్యునోజెనిసిటీ ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తన్నామనీ.. నెల రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
ఇక తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65కోట్ల మందికి టీకాలిచ్చామని తెలిపింది. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. ఈ సీజన్ లో అన్ని జ్వరాలను కరోనాగా భావించ వద్దన్న తెలంగాణ ఆరోగ్య శాఖ.. అనుమానం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అంతేకాదు కరోనా టీకా తీసుకోకపోతే బయటి ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి ఇవ్వకుండా ఉండేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది. ఇదే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపింది. అంతేకాదు 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన విధిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది కదా అని.. ఎవరూ నిర్లక్ష్యం వహించవొద్దని తెలంగాణ వైద్య శాఖ సూచిస్తోంది. కరోనా నిబంధనలు అందరూ పాటించాలంటోంది.