అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఊతమిస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాలిబన్లు అధికారంలోకి రావడం మాత్రం కొన్ని దేశాలకు సంతోషం కలిగిస్తోంది. అలాంటి దేశాల్లో చైనా ఒకటి. మరి చైనాకు ఎందుకు అంత ఆనందం.. తాలిబన్లతో మంచి సంబంధాలు పెట్టుకుంటామని చైనా ఎందుకు ప్రకటిస్తోంది.. అసలు తాలిబన్లతో ఈ చైనా ప్రేమకు కారణాలేంటి..?


తాలిబన్లపై చైనా ప్రేమకు మొదటి కారణం.. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు ఖాళీ చేయడమే.. దీంతో తమకు ముప్పు తొలగిందని చైనా ఆనందపడుతోంది. తమ ప్రాంతంపై అమెరికా పెత్తనం పోయిందని ఫీలవుతోంది. ఇక మరో కీలకమైన కారణం కూడా ఉంది. అదేంటంటే.. అఫ్గాన్‌ తాలిబన్ల వశం కావడంతో అక్కడ లభించే విలువైన అరుదైన ఖనిజ  సంపదపై కూడా చైనా కన్నేసింది. అఫ్గానిస్తాన్‌ చాలా వరకూ కొండ ప్రాంతం.. అక్కడ అనేక విలువైన, అరుదైన ఖనిజాలు ఉంటాయి.


ఈ అరుదైన ఖనిజాలు.. కంప్యూటర్లు, రీఛార్జబుల్‌ బ్యాటరీలు, పవన విద్యుత్తు టర్బయిన్లు వంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడతాయి.  హైబ్రిడ్‌ కార్లు, టెలివిజన్లు, సూపర్‌ కండక్టర్లు వంటి ఆధునిక పరికరాల తయారీలో ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు చాలా అవసరం. అలాంటి ఖనిజ సంపద అప్ఘాన్‌లో ఉండటంతో తాలిబన్లతో దోస్తీతో దాన్ని హస్తగతం చేసుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 85 శాతం ఈ అరుదైన ఖనిజ సంపద చైనా చేతిలోనే ఉంది. అఫ్గాన్‌ ఖనిజ సంపద కూడా హస్త గతం చేసుకుంటే.. ఈ రంగంపై గుత్తాధిపత్యం సాధించవచ్చన్నది చైనా ప్లాన్.


గతంలోనూ చైనా అఫ్గాన్‌లోని పెట్రోలియం బావులు, రాగి గనుల విషయంలో ఒప్పందాలు చేసుకుంది. ఇక ఇప్పుడు తాలిబన్లు అధికారంలోకి రావడంతో మరింత జోరు పెంచనుంది. అందుకే తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు చైనా తహతహలాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: