ఇక డచ్చీస్ వల్లే మీడియా సంస్థ జర్నలిస్టు కోసం వెతుకుతున్న తాలిబన్లు.. తాజాగా అతడి బంధువును కాల్చి చంపారు. ఇంటింటినీ గాలించిన ఉగ్రమూక.. అతడి బంధువులను గుర్తించి ఆచూకీ చెప్పాల్సిందిగా.. ముందుగా వేధింపులకు గురిచేసినట్టు జర్మనీ బ్రాడ్ కాస్టర్ వెల్లడించింది. ఆ తర్వాత ఒకరిని కాల్చిచంపగా వారి దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారంది. దీంతో జర్మనీలోని ఇతర మీడియా సంస్థలూ తమ జర్నలిస్టుల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.
ఆప్ఘన్ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్టు ప్రకటించిన తాలిబన్లు ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నాటో, అమెరికా దళాలకు సాయంగా పనిచేసిన వారిని వెతికేందుకు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ముఖ్యంగా దళాల్లో పనిచేసిన వారిని ప్రాధాన్యతగా వెతుకుతున్నారంది. అటు కాబూల్ విమానాశ్రయ మార్గంలో కూడా వీరి కోసం తాలిబన్లు చెక్ పోస్టులు పెట్టి మరీ వెతుకుతున్నారంది.
ఆఫ్ఘానిస్థాన్ లోని భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్లు తనిఖీలు చేపడుతున్నారు. కాందహార్, హెరాత్ ల్లోని కార్యాలయాల్లో తనిఖీ చేసినట్టు భారత ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందింది. కీలక పత్రాల కోసం వెతికినట్టు తెలుస్తోంది. పేపర్లు, పార్క్ చేసిన కార్లను తీసుకెళ్లినట్టు సమాచారం. కాబూల్ ను దక్కించుకున్న తాలిబన్లు అక్కడ ఇంటింటి తనిఖీ చేస్తున్నారు. అమెరికా నాటో దళాలకు సహకరించిన వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాలిబన్ల అరాచకాలకు అక్కడి పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఈ క్రూరత్వం నుంచి బయటపడేసే వారే లేరా అని ఆ దేవుడిని వేడుకుంటున్నారు.