ఆఫ్ఘానిస్థాన్ లో భారీ ఉగ్రవాద దాడులు జరగొచ్చని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరించాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ పరిసరాలకు దూరంగా ఉండాలని తమ పౌరులకు సూచించాయి. ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనీ.. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆస్ట్రేలియా తెలిపింది.
మరోవైపు తాలిబన్ల చేతిలో తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలను టోలో రిపోర్టర్ జైర్ ఖాన్ యాద్ వ్యతిరేకించారు. తాను క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే కాబూల్ లో కవరేజీ కోసం వెళ్లినప్పుడు తాలిబన్లు తనపై దాడి చేశారని చెప్పారు. దయచేసి తాను మరణించినట్టు వస్తున్న వార్తలను మీడియా ఛానెళ్లు ప్రసారం చేయవద్దని కోరారు. అయితే.. కొద్ది రోజుల క్రితం జర్మనీకి చెందిన న్యూస్ రిపోర్టర్ ను తాలిబన్లు హత్యచేశారు.
ఆప్ఘానిస్థాన్ లో జరిగే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆప్ఘాన్ లో భారతీయుల తరలింపుపై విదేశాంగమంత్రి జైశంకర్ స్పందించారు. భారత పౌరుల తరలింపునకే తమ ప్రాధాన్యమన్నారు. ఆప్ఘాన్లతో స్నేహం ముఖ్యమనీ పార్టీలన్నీ చెప్పాయి. భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంంతం చేస్తామన్నారు. కొందరు ఆప్ఘాన్ పౌరులను తీసుకొచ్చామని జైశంకర్ అన్నారు.
మొత్తానికి తాలిబన్లు ఆప్ఘాన్ ను ఆక్రమించుకున్న దగ్గరి నుంచి రోజుకో కొత్త స్టేట్ మెంట్ ఇస్తున్నారు. మరి ఇతర దేశాలు తాలిబన్ల వ్యవహారంపై ఎలా స్పందిస్తాయో చూడాలి.