భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కు సంబంధించిన పోస్టర్ లో దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడం వివాదమవుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమృత్ మహోత్సవ్ పోస్టర్ లో డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్, వీరసావర్కర్, మదన్ మోహన్ మాలవీయ, బాబూ రాజేంద్రప్రసాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ ఫొటోలు ఉన్నాయి. దీనిని ఐసీహెచ్ఆర్ తన వెబ్ సైట్ లో ఉంచింది. దీంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టర్ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ, దీనిపై నెహ్రూ ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, మొట్టమొదట ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నెహ్రూనే విస్మరించడం ఐసీహెచ్ఆర్ కు తగదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. నెహ్రూను నిర్లక్ష్యం చేసి ఐసీహెచ్ఆర్ తన పరువు తానే తీసుకుందన్నారు. ఇది బీజేపీ కుట్ర కావచ్చని చాలా మంది కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. నెహ్రూ లెగసీని చూసి నరేంద్ర మోడీ, బీజేపీ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు  శామా మొహమ్మద్, గౌరవ్ గొగోయ్, జైరాం రమేశ్ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, నవభారత నిర్మాణంలో నెహ్రూది కీలకపాత్ర అని, ఆయన తెచ్చిన స్వాతంత్ర్యంతో జరుపుకుంటున్న పండుగలో ఆయననే విస్మరించడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఆజాదీకా మహోత్సవ్ లో నెహ్రూ ఫొటో లేనంత మాత్రాన ఆయన స్థాయి తగ్గదని, బీజేపీ పరువే పోతుందంటున్నారు. వేరే ఏ దేశం కూడా స్వాతంత్ర్య సంబరాల్లో తమ మొట్టమొదటి ప్రధానమంత్రిని ఇలా విస్మరించదని, సమున్నతంగా గౌరవించుకుంటుందని, నెహ్రూ, అబుల్ కలామ్ ఆజాద్ ఫొటోలను తొలగించడం అన్యాయమంటున్నారు. దీనిపై ఐసీహెచ్ఆర్ వివరణ ఇవ్వకపోగా, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి మురళీధరన్ మాత్రం కాంగ్రెస్ నాయకులపై ఎదురు దాడి చేస్తున్నారు. ఫొటో లేనంత మాత్రాన ఏమవుతుందని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి మోడీ నెహ్రూ గురించి గొప్పగా చెప్పింది వినిపించలేదా అని అడుగుతున్నారు. ప్రజలు మాత్రం బీజేపీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: