అంతేకాదు కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా పోషక పదార్థాలను అందజేయనున్నారు. రాగిజావ, బెల్లం, లేత మొలకలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు కేటాయించనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్లలో 222రోజులు, ఎన్ సీ ఎల్ పీ స్కూళ్లలో 285రోజులు మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు.
ఇక చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభిస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను ఇండియన్ మెడికల్ అసోషియేషన్ స్వాగతించింది. ఈ నిర్ణయం కాస్త క్లిష్టమైనదే అయినా కరోనా నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలంది. ప్రతి తరగతిలో 20నుంచి 30మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని సూచించింది. స్కూళ్లు తెరవగానే కరోనా కేసులు పెరుగుతున్నట్టు ఎక్కడా తేలలేదని చెప్పింది. టీచర్లు, సిబ్బందికి టీకాలు ఇవ్వాలని వివరించింది.
ఇక చాలా రోజుల విరామం తర్వాత పిల్లలు బడిపట్టారు. ఇన్ని రోజులు స్కూల్ లేకపోవడంతో పిల్లలు పాఠాలు మర్చిపోయారని స్వయంగా తల్లిదండ్రులే చెబుతున్నారు. పాఠశాలల ఆరంభంపై ఓ యూట్యూబ్ ఛానెల్ పిల్లల అభిప్రాయాలను అడిగింది. దీనికి వాళ్ల సమాధానాలు నవ్వు తెప్పించాయి. ఓ పిల్లాడయితే ఏకంగా స్కూల్ పేరే మర్చిపోయాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంటి దగ్గర పనిచెబుతున్నారు.. కాబట్టి పాఠశాలకు వెళ్తానని మరో బాలుడు చెప్పాడు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. విద్యపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విద్యా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.