ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి పడింది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే తమ ప్రచారం కూడా మొదలు పెట్టాయి. అధికార పార్టీ తెరాస దళిత బంధు పథకంతో ఎలాగైనా ఓట్లు కొల్లగొట్టాలని, కానీ బీజేపీ మాత్రం సానుభూతితోనే గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.   అయితే ఈ హుజురాబాద్ ఉప ఎన్నికపై అక్టోబర్ లేదా నవంబర్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోకపోగా తర్జన భర్జన పడుతోంది. అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిలపడంతోపాటు బిజెపి, టిఆర్ఎస్ లో ఎత్తులను  ప్రజాక్షేత్రంలో ఎలాగైనా ఎండగట్టాలని లక్ష్యంతో కాంగ్రెస్  పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో టిపిసిసి మరియు ఏఐసీసీ స్థాయిలో  కసరత్తు చేస్తోంది. అయితే ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో పాటు, రాష్ట్ర స్థాయి నాయకులు కరీంనగర్లో సమావేశాన్ని  ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ సమావేశంలో  హుజురాబాద్ లో గట్టిపోటీని ఇవ్వటమే కాకుండా , గెలుపు దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. దీంతో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, అలాగే అనుబంధ విభాగాల నాయకులంతా పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగే ఉప ఎన్నిక కొరకు మొదట మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే సాంబయ్యల పేర్లు ప్రముఖంగా బయట కనిపించాయి.

కానీ పి సి సి  సమావేశంలో స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలనే ఆరోపణలు రావడంతో దరఖాస్తులు ఇవ్వాలని ఆలోచన చేశారు కాంగ్రెస్ వర్గాలు. దీంతో 18 మంది ఆశావహులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ వంటివారు మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో కాంగ్రెస్ ఖంగు తిన్నది. అయితే దీనిపై ఎలాగైనా కొండా సురేఖ ఒప్పించి దరఖాస్తు చేసుకునేలా కసరత్తు కూడా మొదలు పెట్టిందని  సమాచారం. అయితే ఆమె దరఖాస్తు చేసుకుంటే  హుజురాబాద్ టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: