వచ్చే ఏడాది ఏప్రిల్ లో చెల్లించా ల్సిన స్పెక్ట్రమ్ వాయిదాల పై ఏడాది మారటోరియం ప్రకటించినట్లు తెలిసింది కేంద్ర కేబినేట్. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా కంపెనీకి పెద్ద ఊరట లభించిందనే చెప్పొచ్చు. వొడాఫోన్ ఐడియా కంపెనీ.. కేంద్రానికి 50వేల కోట్ల రూపాయలకు పైగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో, ఇటీవల ఆ కంపెనీ మాజీ ఛైర్మన్ కుమారం మంగళం బిర్లా తన వాటాను కేంద్రానికి ఇచ్చేస్తానంటూ కేబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో.. టెలికాం రంగానికి భారీగా ఊరట కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్‌లో టెలికాం షేర్లు దూసుకెళ్లాయి. అలాగే.. ఆటో రంగానికి కూడా బూస్ట్‌నిచ్చింది కేంద్రం. కరోనా కారణంగా ఢీలాపడ్డ దేశీయ వాహన రంగానికి భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. 26 వేల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రిత్వ శాఖ. ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు ఏడున్నర లక్షల ఉద్యోగాలను సృష్టించొచ్చని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం వర్తించనుందని స్పష్టం చేసింది కేంద్రం. 25 వేల కోట్లు ఆటో రంగానికి కాగా...120కోట్లు డ్రోన్ పరిశ్రమకు కేటాయించామని తెలిపింది.