అంటే జగన్ ముఖ్యమంత్రిగా సగం పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈ రెండున్నర సంవత్సరాలు పార్టీకి ఎంతో కీలకం. ఇప్పటికే జగన్ పాలన పూర్తికావడంతో జగన్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై రెండుమూడుసార్లు అంతర్గతంగా సర్వేలు చేయించుకొని నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నివేదికలో దాదాపు 100 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం సరిగా లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో చాలామంది కొత్త వారికి , యువకులకు జగన్ కొన్ని సమీకరణాల కారణంగా టిక్కెట్లు ఇచ్చారు. వారి పనితీరు ఏమాత్రం బాగోలేదని ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలే చెపుతున్నారు.
కొందరు ఎమ్మెల్యే లు పార్టీ ఆవిర్భవించి నప్పటి నుంచి పనిచేసిన సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారు. మరి కొందరు నేతలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ ద్వితీయ శ్రేణి నేతలను పక్కన పెట్టేశారు. మరి కొందరు కమీషన్లు ఇవ్వడం లేదని.. సొంత పార్టీ నేతలకు కాకుండా విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కుమ్మక్కు అయ్యి వారికి కాంట్రాక్టులు , పనులు ఇస్తున్నారు.
అసలు ఈ రెండున్నరేళ్లలో ఏ వైసీపీ కార్యకర్త కూడా రాష్ట్రంలో సంతృప్తిగా లేరు. ఏపనీ కూడా ఎమ్మెల్యేల వల్ల కావడం లేదు. అసలు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండడం లేదు. ఇవన్నీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ టిక్కెట్లు ఇవ్వరనేది వాస్తవం.