భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చినా దాని ప్రభావం పెద్దగా ఉండబోదని CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంస్ట్రీయల్ రీసెర్చ్ ఆఫ్ ) వెల్లడించింది. దేశంలో భారీ భారీ సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారనీ.. టీకా వేసుకున్న తర్వాత కరోనా వచ్చినా తీవ్రత ఎక్కువగా ఉండదని తెలిపింది. వైరస్ ను నివారించే శక్తి మన టీకాలకు ఉందని పేర్కొంది. అటు పలువురు నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. వైరస్ లో తీవ్ర మార్పులు జరిగితే తప్ప దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువేనంటున్నారు.

మరోవైపు కొవిడ్ చికిత్సలో నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాలను తొలగిస్తూ ఐసీఎమ్ఆర్ కీలక సూచనలు చేసింది.  బాధితుల్లో వైరస్ ప్రభావం తగ్గించడంలో ఈ రెండు ఔషధాల పనితీరుపై ఆధారాలు లేవని పేర్కొంది. మరో రెండు ఔషధాలు రెమ్ డెసివిర్, టోసిలిజమాబ్ లను మాత్రం ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వొచ్చని తెలిపింది. ఆక్సిజన్ అవసరమైన బాధితులకు రెమ్ డెసివిర్, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి టోసిలిమాబ్ ను ఇవ్వొచ్చంది.

ఇక కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనత సాధించింది. సెప్టెంబర్ లో దేశంలో 18.74కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఆగస్ట్ లో 18.38 కోట్ల డోసులు ఇచ్చిన భారత్.. ఈ నెలలో మరికొన్ని రోజులు మిగిలి ఉండగానే.. దానిని అధిగమించింది. ఈ నెలలో సగటున రోజుకు 81.48లక్షల డోసులను వేయగా.. మే నెలలో ఇచ్చిన వ్యాక్సిన్ల కంటే ఇది 4రెట్లు అధికం. అయితే దేశంలో ఇప్పటి వరకు 84కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

మరోవైపు కరోనాతో మరణించిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. కరోనాతో ఇంట్లో మరణించినా.. 50వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అయితే సదరు వ్యక్తి కరోనాతో ప్రాణం కోల్పోయినట్టు డాక్టర్ నుంచి ధృవీకరణ పత్రం ఉండాలంది. అటు కోవిడ్ సోకిన 30రోజుల లోపు సంభవించే మరణాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తిస్థాయి మార్గదర్శకాలు వచ్చాక పరిహారంపై దృష్టి పెడతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.  












మరింత సమాచారం తెలుసుకోండి: