జనసేన సంగతి సరే.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటన్నది.. పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బద్వేల్ ఉపఎన్నికల విషయంలో మొదట నుంచి ఉత్సాహం చూపిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చేసినట్టే.. బద్వేల్ లో కూడా పోటీ చేయాలని భావించారు. చివరి నిమిషంలో జనసేన అభ్యర్థిని పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన పక్కకు తప్పుకోవడంతో బీజేపీ కూడా ఆలోచనలో పడింది. తమ మిత్రపక్షమైన పవన్ ప్రకటనను గౌరవించి బీజేపీ బద్వేల్ ఉపఎన్నికల పోరు నుంచి తప్పుకుంటుందా లేదా అనేది అనుమానమే.
జనసేన, బీజేపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పరిస్థితి ఏంటి..? పవన్ కల్యాణ్ జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టడం లేదు. బీజేపీ కూడా అదేదారిలో వెళ్తే ఇక టీడీపీ అభ్యర్థే ప్రదాన ప్రత్యర్థిగా ఉంటారు. ఒకవేళ జనసేన, బీజేపీ లోపాయికారీగా టీడీపీకి సపోర్ట్ చేస్తే కచ్చితంగా అది ఆ పార్టీకి లాభమే అవుతుంది. ఆ రెండు పార్టీలు తటస్థంగా ఉండి, మిగతా ఓటర్లలో కూడా సింపతీ ప్రభావం బాగా పెరిగితే మాత్రం అది టీడీపీకి కష్టమే. మొత్తమ్మీద బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో పవన్ చేసిన ప్రకటన తర్వాత మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికలకు నెలరోజుల్లోపే టైమ్ ఉన్న నేపథ్యంలో టీడీపీ స్పీడు పెంచుతుందా.. నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగుతారా.. లోకేష్ లైన్లో కొస్తారా..? అసలేం జరగబోతోందో.. ఈ దశలో టీడీపీ స్టాండ్ ఏంటనేది త్వరలోనే క్లియర్ అవుతుంది.