ఇప్పటికే కొందరు బీజేపీ నేతలను, ఈటెల మద్దతుదారులను.. టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మరోవైపు ఈటెల కూడా తగ్గేదేలేదంటూ అధికార టీఆర్ఎస్ నేతలనూ బీజేపీ లోకి ఆహ్వానించి.. కండువాలు కప్పేస్తున్నారు. ఇలా అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వలసలు పెరిగిపోయాయి. బీజేపీ అధినాయకత్వం కూడా ఈ ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తోంది.
హుజురాబాద్ ఉపఎన్నికల కోసం బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి దిగుతారని అందరూ భావించారు. రోడ్ షోలు చేయాలని.. భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వెయ్యి మందికే బహిరంగ సభలు పరిమితం అంటూ ఈసీ తేల్చి చెప్పడంతో హుజూరాబాద్ ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు రాలేకపోతున్నారు. దీనికతోడు మరో బలమైన కారణం కూడా బీజేపీ నేతలు ప్రచారానికి రాకుండా చేసింది. యూపీలో రైతులపైకి దూసుకెళ్లిన కారు వ్యవహారం బీజేపీని జాతీయ స్థాయిలో బాగా భ్రష్టుపట్టించింది. ఓవైపు సుప్రీంకోర్టులో చీవాట్లు, మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు.. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్ కి జాతీయ స్థాయి నేతలు వస్తే అది కచ్చితంగా తనకే మైనస్ అనుకుంటున్నారు ఈటల. అందుకే వారెవరూ తన ప్రచారానికి రాకపోవడమే మంచిదని అనుకుంటున్నారట. మొత్తమ్మీద దుబ్బాక, జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో ఓ రేంజ్ లో హడావిడి చేశారు. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల విషయంలో ఆ హడావిడి ఇంకా మొదలు కాలేదు.