మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్ నగర్ కు చెందిన లింగయ్య కుమార్తె అనూష ఇంటర్మీడియట్ తర్వాత చెన్నైలో బి ఫార్మసీ పూర్తి చేసింది. సెంట్రల్ గ్రీన్ ల్యాండ్స్ యూనివర్సిటీ లో మాస్టర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది. ఇక అమెరికాలో ఉద్యోగం సంపాదించి లక్షల్లో జీతం అందుకుంది. కానీ కరోనా వైరస్ సమయంలో చివరికి భర్తతో కలిసి ఇండియా వచ్చేసింది. అయితే ఆ సమయంలోనే ఆ మహిళకు మనసులో ఒక ఆలోచన మొదలైంది. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఖాళీగా ఉండలేక ఒక కొత్త ఆలోచన చేసింది. స్వచ్ఛమైన తేనెను తయారు చేయాలని అనుకుంది. దీంతో తేనెటీగల పెంపకం పై దృష్టి సారించి విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఏకంగా ఏడాదిన్నర పాటు తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకుని 50 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించింది.
వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగింది అనూష. ఇలా సేకరించిన తేనెను హైదరాబాద్ ఎల్బి నగర్ లోని ప్యాకింగ్ పాయింట్ కు తరలించి బి ఫ్రెష్ పేరుతో ప్యాకింగ్ చేసి బెంగుళూరు ముంబై ఢిల్లీ హైదరాబాద్ లోని దుకాణాలకు కూడా సరఫరా చేస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా ఈ వ్యాపారం లో దూసుకుపోతుంది. మొదటి వ్యాపారం ప్రారంభించినప్పుడు కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ కుటుంబం నుంచి ప్రోత్సాహం అందడంతో ముందడుగు వేశా అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు వ్యాపారం ద్వారా మరికొంత మందికి ఉపాధి కలిగించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలుపుతుంది. కంప్యూటర్లు మాత్రమే కాదు ప్రకృతి కూడా ఎంతో ఉపాధిని కల్పిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది ఈ యువతి.