రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల సింప‌తీ కావాలి. ప్ర‌జ‌ల నుంచి మెప్పు కావాలి. అది లేక‌పోతే.. ఎన్నిక‌ల్లో ఓట్లు రాల‌వ‌నే భ‌యం.. అభ‌ద్ర‌త రెండూ ఉంటాయి. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామకృష్ణ మూర్తి విష‌యంలోనూ ఈ రెండూ క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌ల్లో మెప్పు పొందేందుకు.. ప్ర‌జ‌ల సింప‌తీ సంపాయించుకునేందుకు క‌ర‌ణం అనుస‌రిస్తున్న మార్గంపైనే ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను బ‌ల‌వంతంగా స‌భ‌లో కూర్చోబెట్టిన తీరు.. వారిపై పోలీసుల‌ను ప్ర‌యోగించి.. ఆపిన వైనం వంటివి.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.
ఇటీవ‌ల ప్ర‌భుత్వం వైఎస్సార్ ఆస‌రా.. రెండో విడ‌త కార్య‌క్ర‌మం ప్రారంభించింది. ఈ క్ర‌మంలో తొలుత క‌ర‌ణం బ‌ల‌రాం.. మాజీ ఎమ్మెల్యే, చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న‌ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌పై పైచేయి సాధించే వ్యూహంతో ఆమంచి సొంత మండ‌లం..  వేట‌పాలెంలోని రామ‌న్న‌పాలెం.. విలేజ్‌లో ఆస‌రా స‌భ‌ను నిర్వ‌హించారు. స‌హ‌జంగానే ఆమంచికి ప‌ట్టున్న ప్రాంతం కావ‌డంతో ఇక్క‌డ క‌ర‌ణం స‌భ‌కు పెద్ద‌గా జ‌నాలు రాలేదు. దీంతో ఇక్కడ స‌భ ఫెయిల్ అయింది. దీంతో త‌ర్వాత చీరాల మునిసిపాలిటీ, చీరాల మండ‌లంలో స‌భ‌లు ఏర్పాటు చేశారు. వీటికి డ్వాక్రా మ‌హిళ‌ల‌ను తెచ్చి.. హ‌డావుడి చేశారు. అయితే..  చీరాల మునిసిపాలిటీలో 9 గంట‌ల‌కు స‌భ ఉంటుంద‌ని చెప్పి హ‌డావిడి చేశారు. అయితే మ‌ధ్యాహ్నం ఒంటి గంట అవుతున్నా సభ ప్రారంభం కాలేదు.
దీంతో అప్ప‌టి వ‌ర‌కు వేచి ఉన్న జ‌నాలు.. క‌ర‌ణం స్పీచ్ ప్రారంభం కాగానే.. లేచివెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. ఆస‌రా స‌భ నిర్వ‌హించిన‌ మైదానంలో మూడు గేట్లు ఉంటే.. మూడు గేట్ల నుంచి కూడా జ‌నాలు వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. అయితే అక్క‌డ పోలీసుల‌ను పెట్టించి త‌మ‌ను భ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ప్ర‌య‌త్నాలు చేశార‌ని డ్వాక్రా మ‌హిళ‌లు వాపోతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇలా.. బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌ను మెప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఏంటి? అని క‌ర‌ణంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.
ఇక‌, మ‌రో కీల‌క సంఘ‌ట‌న ఏంటంటే.. మూడు ఆస‌రా ప్రోగ్రాంల క‌న్నా ముందే.. జ‌గ‌న్ ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చిన జ‌గ‌న్.. స‌భ‌లోనే ఆయ‌న‌తో ఏదో గుస‌గుస‌లాడారు. ఈ ప‌రిణామం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా చర్చ‌నీయాంశంగా మారింది. దీంతో క‌ర‌ణం వ‌ర్గంలో మ‌రింత అభ‌ద్ర‌తా భావం పెరిగింద‌ని.. అందుకే.. ఇలా ఆస‌రా స‌భ‌ల్లో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేసి .. బ‌లవంతపు సింప‌తీ కోసం ప్ర‌య‌త్నించార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా చేయ‌డం క‌ర‌ణం వంటి సీనియ‌ర్‌కు త‌గునా? అనేది విశ్లేష‌కుల మాట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: