తాను వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో తాను పేషెంట్ల మధ్య తిరిగితే.. కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్‌లో కూర్చున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కావాలనే మంత్రి పదవీ నుంచి తొలగించాడని మండిపడ్డారు. ఇజ్జత్ లేని దగ్గర ఉండొద్దనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్టు చెప్పారు. సొంత పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కూడా తన వెంట రావద్దని.. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పెట్టి కొన్నారని ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నాకు మద్దతు పలుకుతున్నారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తాను టీఆర్ఎస్ పార్టీలో మధ్యలో చేరలేదని.. దాని నుంచి మధ్యలో బయటికి రాలేదని ఈటల పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 20 ఏండ్ల చరిత్ర ఉంటే.. అందులో తన చరిత్ర 18 ఏండ్ల 6 నెలల కాలం ఉందని వెల్లడించారు. తాను రాజీనామా చేయడం మూలంగానే హుజూరాబాద్‌లో దళితబంధు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. నాకు ఎమ్మెల్యే పదవీ నా తల్లి, తండ్రి ఇవ్వలేదు అని కామెంట్ చేశారు. ఈ విషయంలో కేసీఆర్ సోయి తప్పాడని.. తాము శ్రమను, చెమటను నమ్ముకున్నోళ్లం అని చెప్పారు. తాము పైరవీలు చేసేటోళ్లం కాదు. కేసీఆర్ కలలో కూడా తననే తలుచుకుంటాడని ఈటల పేర్కొన్నారు. బీజేపీని గెలిపించి కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.