తెలంగాణ అంతటా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్ సజావుగా ముగిసింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. మరి భారీగా నమోదైన పోలింగ్ ఏ పార్టీకి లాభిస్తుంది.. ఇది ఏ పార్టీని దెబ్బ తీస్తుందన్న చర్చ సాగుతోంది. అయితే పోలింగ్ జరిగిన తీరును ఏ పార్టీ నేతలు.. ఆ పార్టీనేతలు.. సమీక్షించుకోవడం మామూలే.. పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ నేతల్లో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. విజయం ఈటలదేనని ధీమాగా చెబుతున్నారు. అయితే.. ఆ ధైర్యం టీఆర్ఎస్‌ వర్గాల్లో కనిపించడం లేదు.


ఓటరు తీర్పు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమైనా.. అది బీజేపీకే అనుకూలమని అనేక ఎగ్జిట్‌ పోల్స్  సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఒక్క సర్వే కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పకపోవడం విశేషం. వందల కోట్ల రూపాయలు డబ్బు పంపిణీ చేసినా..  వేలాది కోట్ల జీవోలు ఇచ్చినా.. అధికార బలంతో సీఎం కేసీఆర్ ఎంతగా ప్రయత్నించినా తన గెలుపును ఆపలేకపోయారని ఈటల రాజేందర్ ముందుగానే విజయ ప్రకటన చేశారు. ఈటల రాజేందర్ ముఖం అసెంబ్లీ లో కనిపించవద్దు అనే కేసీఆర్ పంతం నెరవేరలేదని ఆయన ధీమాగా చెప్పారు. ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు చరిత్ర తిరగరాశారన్న ఈటల.. బీజేపీ నేతలంతా తనకు సహకరించారని చెప్పుకొచ్చారు.


అయితే.. హుజురాబాద్ లో గొప్ప విజయం సాధించబోతున్నామని హరీష్ రావు కూడా అంటున్నా.. ఆ మాటల్లో ధీమా కనిపించడం లేదు. టీఆర్ఎస్ విజయానికి కష్టపడిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన హరీష్ రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యాన్ని చాటారన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. అయితే హుజూరాబాద్‌ ఫలితం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వస్తే.. అందుకు ముందుగా బలయ్యేది హరీశ్ రావేనన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌ నేతల జోస్యం ఫలిస్తుందా.. లేక.. బీజేపీ విజయ ప్రకటన నిజమవుతుందా.. అన్నది నవంబర్ 2గానీ తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: