తెలుగుదేశం పార్టీ.. తన చరిత్రలోనే ‌అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న ఆ పార్టీ.. ఆ తర్వాత కూడా ఆత్మవిశ్వాసం కనబరచడం లేదు. మరో మూడేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఉంటే తప్ప.. సొంతంగా సత్తా చాటే పరిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి పోరాటం చేయడం వల్ల అనేక చోట్ల ఓట్ల చీలిక టీడీపీకి నష్టం చేసింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ, జనసేన వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది.


అయితే.. టీడీపీకి పొత్తు ఆలోచన ఉన్నా.. దాన్ని బీజేపీ ఆదిలోనే తుంచేస్తోంది. టీడీపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ భవిష్యత్‌లో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. అయితే.. బీజేపీలోని మాజీ టీడీపీ నేతలు మాత్రం ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే.. ఇటీవల సీఎం రమేశ్ టీడీపీ-బీజేపీ పొత్తులపై షాకింగ్ కామెంట్లు చేశారు. టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఉండదని చెప్పలేమని.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని.. అసలు పొత్తులు డిసైడ్ చేసేది సునీల్‌ దేవధర్ కాదని.. హైకమాండ్ నిర్ణయిస్తుందని సీఎం రమేశ్ చెప్పారు.


దీంతో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తుకు అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు బీజేపీ ఏపీ ఇంఛార్జ్‌ సునీల్ దేవధర్ ఈ అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.. తమ పార్టీలో రెండు మాటలు ఉండవని.. తాము ఎప్పుడూ పార్టీ స్టాండే చెబుతామని తేల్చి చెప్పేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజ్యసభ స‌భ్యుడు, టీడీపీ నుంచి త‌మ పార్టీలోకి ఫిరాయించిన సీఎం ర‌మేశ్‌ గాలి తీసేశారు. టీడీపీతో పొత్తు విష‌య‌మై సీఎం ర‌మేశ్‌కు సునీల్ దేవధర్‌ గ‌ట్టి  సమాధానమే ఇచ్చారు.


టీడీపీతో పొత్తు ప్రశ్నే వుండ‌ద‌ని బీజేపీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధ‌ర్ పిచ్చ క్లారిటీతో చెప్పేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న పొత్తు ఆశలు గల్లంతయ్యాయి. జనసేనతోనైనా పొత్తు కోసం ప్రయత్నిస్తారా.. లేదా.. అన్నది చూడాలి. ఒకవేళ జనసేనకూ  బీజేపీ కూ చెడితే మాత్రం టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: