ఇవాళ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. కేసులు ఊసు ఎలా ఉన్నా కేకులు మాత్రం పంచుకుతింటోంది. జిల్లాలలో వివిధ నియోజకవర్గాల్లో తమ అధినేతకు మద్దతుగా ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేస్తోంది. పాదయాత్రలు నిర్వహిస్తోంది. అంతేకాదు రానున్న కాలంలోనూ ఇదే హవా కొనసాగనుందని కూడా చెబుతోంది. వీటి తీరు ఎలా ఉన్నా కూడా జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు మాత్రం అలానే ఉన్నాయి. వాటిలో ఎటువంటి మార్పూ లేదు రాదు కూడా! ముఖ్యంగా కార్పొరేట్ శక్తుల ప్రేమలో జగన్ ఉండిపోతున్నారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ. అందుకు తార్కాణంగా చేపట్టిన పనులు, లేదా వారికి అనుగుణంగా ఉన్న నిర్ణయాలు పదే పదే జగన్ లో లోపాలను పట్టి ఇస్తున్నాయి. ఎత్తి చూపుతున్నాయి. ఓ వైపు పారదర్శక పాలన అంటూనే మరోవైపు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని విమర్శలకు చోటిస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక గుజరాతీ వ్యాపారులు అయిన అంబానీ కానీ అదానీ కానీ బాగానే లబ్ధి పొందారు. అంబానీ స్నేహితుడికి ఎంపీ పదవి ఇచ్చాడు జగన్. అలానే అదానీకి గంగవరం పోర్టుతో పాటు విద్యుత్ కొనుగోలు విషయమై కూడా పెద్ద సాయమే చేశారు. పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా గా ఉన్న మొత్తాన్ని కూడా అదానీకే అమ్మి నిధులు పోగేశారు. ఇదేమని అంటే తీవ్ర ఆర్థిక సంక్షోభాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పింది కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అదానీ గ్రూపునకే చెందిన సోలార్ ఎనర్జీ ని కొనుగోలు చేసేందుకు కూడా జగన్ ఎప్పుడో ఒప్పందాలు చేసుకున్నారు. యూనిట్ ఛార్జి అన్నది ప్రభుత్వ సంస్థల దగ్గర లభ్యం అవుతున్న తీరు కన్నా ఎక్కువకు చెల్లించి మరీ! జగన్ తన స్వామిభక్తిని చాటుతున్నారు. ఇవన్నీ వెలుగులోకి వస్తున్నా కూడా ఒకనాటి హామీలపై ఊసే ఎత్తని జగన్ ఇప్పుడు కూడా ఆస్తుల విక్రయం పై తప్ప ఆదాయం ఆర్జన పై దృష్టి అన్నది లేకుండా ప్రభుత్వాన్ని ఒంటెద్దు పోకడల్లో భాగంగా నడుపుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు.