తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని అధికార పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వరి వేయొద్దని చెబుతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం వరి వేయాలని చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ నినాదం జైకిసాన్ కాదు.. నై కిసాన్ అని ఎద్దేవా చేస్తున్నారు. రైతులపై ప్రేమ ఉంటే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని.. ఆ పార్టీకి చెందిన గవర్నర్లే వాటిని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. బీజేపీ ధాన్యానికి మద్ధతు ధర లేకుండా చేస్తోందని విమర్శిస్తున్నారు.

ఇక తెలంగాణ దేశమంతటికీ బువ్వ పెడుతోందని.. వారి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఈ విషయాన్ని కాలర్ ఎగరేసుకొని చెప్పాలన్నారు. గతంలో ఒకాయన సీఎంగా ఉంటే ఏడేళ్లు కరవే ఉందనీ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఎప్పుడైనా కరవు వచ్చిందా అని ప్రశ్నించారు. దేశాన్ని పాలించే వాళ్లకు రైతులపై ప్రేమ లేదని విమర్శించారు. అన్ని అమ్ముతున్నారు.. వడ్లు కొనడం లేదని చెప్పారు.

యాసంగిలో పండేది బాయిల్డ్ రైస్ అని.. దాన్ని కొనమని కేంద్రం తెగేసి చెప్పిందని కేటీఆర్ అన్నారు. అలా అని ధాన్యాన్ని వేరే దేశాలకు ఎగుమతి చేద్దామంటే ఆ అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపారు. కేంద్రం ధాన్యం కొనాలని చెబితేనే.. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము వరి వేయొద్దు అంటే.. ఇక్కడి బీజేపీ వాళ్లు వరి వేయాలని గందరగోళం చేస్తున్నారని చెప్పారు.

వరి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న టీఆర్ఎస్ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తనదైన రీతిలో సమాధానమిస్తున్నారు. ఏ రైతూ బాయిల్డ్ రైస్ పండించరనీ.. ఇది కేవలం రైస్ మిల్లర్ల సమస్యగా కొట్టిపారేశారు. దశల వారీగా బాయిల్డ్ రైస్ తగ్గించాలని కేంద్రం చెప్పిందంటున్నారు. వరిధాన్యం కొనేదిలేదని కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అని నిలదీశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: