ఇంతకీ డీఎస్ దారెటూ..? కాంగ్రెస్ వైపా లేక కమలం వైపా? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఈరోజుల్లో వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నా, కూర్చుని మాట్లాడుకున్నా ఏదో జరుగుతుందనే ప్రచారం వెంటనే మొదలవుతుంది . వారు ఏం మాట్లాడుకున్నారో తెలియకపోయినా రకరకాల కథలు బయటకు వస్తాయి. వారిద్దరిలో ఎవరో ఒకరు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డిఎస్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. హుజరాబాద్ లో బిజెపి నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, డిఎస్ ను కలుసుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. వారేం మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే డి ఎస్ ను బీజేపీలోకి ఆహ్వానించడానికి ఈటెల రాజేందర్ ఆయనను కలిశారని చెబుతున్నారు. డిఎస్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరగానే కెసిఆర్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. కానీ ఆ తర్వాత కథ బెడిసి కొట్టింది.

 ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మొత్తంమీద కెసిఆర్, డిఎస్ శత్రువులయ్యారు. డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చినా కొన్ని కారణాల వల్ల కేసీఆర్ చర్యలు తీసుకోలేక పోయారు. తనకు తానే పార్టీ నుంచి వెళ్లిపో కూడదని డీఎస్ అనుకున్నారు. కొంతకాలం తర్వాత డిఎస్ రాజ్యసభ సభ్యత్వం ఎలాగూ ముగిసిపోతోంది. దీంతో టిఆర్ఎస్లో ఆయన కథ ముగియనుందని కెసిఆర్ భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. టిఆర్ఎస్ లో ఇక్కడి డి ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదన్నది అందరికీ తెలిసిందే. దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే డిఎస్ ఆషామాషీ  నాయకుడు కాదు. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో కాంగ్రెస్లో కీలక నాయకుడు. రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన హయాంలోనే పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇంతటి చరిత్ర ఉన్న డిఎస్ ను మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకురావాలని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. డిఎస్ ను కలిసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి కలవడానికి ముందు డి ఎస్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తప్పు చేశానని చెప్పారు. ఆ తర్వాతనే రేవంత్ వెళ్లి డిఎస్ ను కలిశారు. దీంతో డి ఎస్ కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరిగింది. అయితే హుజూరాబాద్ లో గెలుపు తర్వాత బిజెపి డి ఎస్ మీద కన్నేసిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈటల కూడా డీఎస్ ను కలవడంతో బిజెపిలో చేరవచ్చని అంటున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి డీఎస్ బిజెపి వైపు మొగ్గు చూపవచ్చని అంటున్నారు. డిఎస్ ను బిజెపిలోకి రావాలని ఈటెల రాజేందర్ కూడా  ఆహ్వానించినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి తద్వారా టిఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని ఈటెల రాజేందర్ ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరే విషయంలో డిఎస్ సానుకూల నిర్ణయం తీసుకొని  మనసు మార్చుకుంటే అందుకు ఈటెల రాజేందర్ కూడా ఓ కారణమని చర్చ సాగుతుంది. దీంతో డిఎస్ నిర్ణయం ఏ దిశగా ఉండనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: