తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తమిళనాడు మంత్రి పొన్నుముడి, కేరళ మంత్రి రాజన్ హాజరయ్యారు. ఇంకా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కూడా ఈ ప్రాంతీయ మండలి భేటీకి హాజరయ్యారు.


ఈ సమావేశంలో అందరికంటే ఆఖరుగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాలు కరోనా రెండో డోసు టీకా వేగవంతం చేయాలని అమిత్‌ షా సూచించారు. ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు కరోనా టీకా పురోగతిని ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని అమిత్‌షా సూచించారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను కేంద్రం సవరించే కార్యక్రమం చేపట్టిందన్న హోంమంత్రి అమిత్‌ షా.. నిపుణులు, అధికారులతో చర్చించి చట్ట సవరణలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని అమిత్‌షా సూచించారు.


చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు సమర్థనీయం కాదన్న అమిత్‌ షా.. చిన్నపిల్లల లైంగిక వేధింపుల కేసులకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. దేశాభివృద్ధిలో గిరిజనుల పాత్రను గుర్తిస్తూ నవంబర్‌ 15 ను జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అమిత్‌ షా తెలిపారు. దేశాభివృద్ధిలో గిరిజనుల పాత్రకు ప్రాధాన్యతనిస్తూ వారం రోజుల పాటు వివిధ రూపాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అమిత్‌ షా ముఖ్యమంత్రులను కోరారు.


ఇదే సమావేశంలో డ్రగ్స్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. యువత జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల నియంత్రణకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యత ఇవ్వాలని అమిత్‌ షా సూచించారు. విచారణ వేగవంతం చేయడానికి రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రాంతీయ భాషలతో కూడిన పాఠ్యాంశాలతో ప్రతి రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కళాశాల ఏర్పాటు చేయాలని సూచించారు అమిత్‌ షా.


మరింత సమాచారం తెలుసుకోండి: