అయితే.. కుప్పం ఓటమి నుంచి జనం దృష్టి మరల్చేందుకే చంద్రబాబు ఏడుపు డ్రామా ఆడుతున్నారన్న వాదన వైసీపీ నుంచి వస్తోంది. అయితే.. ఇక్కడ అమరావతి రైతుల నుంచి మరో వాదన వస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు మహా పాదయాత్ర పేరుతో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని.. దీని నుంచి దృష్టి మరల్చేందుకు చంద్రబాబును అసెంబ్లీలో నానా మాటలు అన్నారని అమరావతి రైతు నేతలు చెబుతున్నారు.
నిన్న ఓ ఛానల్ చర్చలలో పాల్గొన్న రైతు ప్రతినిధులు.. అమరావతి ఉద్యమానికి జనంలో బాగా ఆదరణ కనిపిస్తోందని.. మీడియాలోనూ బాగా హైలెట్ అవుతోందని.. అందుకే దాని నుంచి జనం దృష్టి మళ్లిస్తున్నారని.. అమరావతిని రాజధాని కొనసాగించడం జగన్ కు ఇష్టం లేదని.. అందుకే ఇలా ఉద్యమానికి ప్రాచుర్యం రానీయకుండా.. పనికి మాలిన విమర్శలతో వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అమరావతి రైతులు, రైతు నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే.. ఈ విమర్శల ఎంత వరకూ వాస్తవం అన్నది ఓ సారి ఆలోచించాలి. అమరావతి పాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎంపిక చేసిన కొన్ని చానళ్లు మాత్రం ఈ యాత్రను బాగా ఫోకస్ చేస్తున్నాయి. ఇది టీడీపీ నేతలు చేయిస్తున్న బలవంతపు యాత్ర అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ యాత్రను అడ్డుకునే వ్యూహంతోనే చంద్రబాబు భార్య గురించి అడ్డగోలుగా మాట్లాడరంటున్న వాదనలో అంత బలం కనిపించడం లేదు.