కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్‌లో చోటు చేసుకుంటున్నాయి..మున్సిపాలిటీలో టీడీపీకే మెజారిటీ ఉన్నా సరే, ఛైర్మన్ ఎంపిక సమయానికి ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈలోపు అధికార వైసీపీ, కొందరు టీడీపీ కౌన్సిలర్‌లని తమ వైపుకు తిప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల వెలువడిన కొండపల్లి మున్సిపల్ ఫలితంలో 29 వార్డుల్లో టీడీపీ 14 వార్డులు, వైసీపీ 14 వార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలిచారు.

అయితే ఇండిపెండెంట్ అభ్యర్ధి అనూహ్యంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి లీడ్ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్‌అఫిషియో ఓటు వేయనున్నారు. దీంతో టీడీపీకి 15, వైసీపీకి 15 ఓట్లు వస్తాయి. ఇదే క్రమంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఓటు నమోదు చేసుకోవడానికి చూశారు గానీ, అధికారుల దగ్గర నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన కోర్టుకు వెళ్ళి ఓటు తెచ్చుకున్నారు.


దీంతో ఆయన కూడా కొండపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌లు మొదలయ్యాయి. కేశినేనికి ఓటు హక్కు ఉందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం రాలేదని కొండపల్లి మున్సిపల్ ఎన్నికల అధికారి శివనారాయణరెడ్డి చెబుతున్నారు. కోర్టు ఉత్తర్వులు అందాక దాని బట్టి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా అర్ధం కావడం లేదు.

అదే సమయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నాయి. ఇక టీడీపీ అభ్యర్ధులని లాగడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుందట. లొంగకపోతే కేసులు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి ఛైర్మన్ ఎంపిక సమయానికి వచ్చేసరికి కొండపల్లి రాజకీయం ఎలా మారుతుందో చూడాలి. అధికార బలంతో అనూహ్యంగా కొండపల్లి వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: