కరోనా.. ఎందరి జీవితాలనో నాశనం చేసింది. కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కొన్నయితే.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు మరికొన్ని. అయితే... ఈ కరోనా చిన్నారుల జీవితాలనూ ఛిన్నాభిన్నం చేసింది. వారి చదువులను చట్టుబండలు చేసింది. కరోనా సమయంలో ఎందరో చిన్నారులు పాఠశాలలకు దూరమయ్యారు. గతంలో దర్జాగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన ఎందరో బాలలు.. ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల కారణంగా.. సర్కారు బళ్లకు వెళ్తున్నారు.


కరోనా వల్ల వచ్చిన ఆర్థిక కష్టాలు కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరిగిందట.. ఈ విషయాన్ని ఆసర్‌ నివేదికలో తెలిపింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..  దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ట్రెండ్ ఉందట.. ప్రభుత్వ స్కూళ్లలో  ఈ ఏడాది 4.5% ప్రవేశాలు పెరిగాయట. సాధారణంగా ఏటా ఈ శాతం తగ్గుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం పెరిగిందట. గతేడాది అంటే 2020లో ప్రభుత్వ స్కూళ్లలో 65.8% అడ్మిషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈ శాతం 70.3 శాతానికి పెరిగింది. కరోనా కష్టాలతో పాటు ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత సౌకర్యాలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు.


కరోనా వల్ల లాక్‌డౌన్‌ పెట్టారు.. ఆ సమయంలో కార్మికుల వలసలు కూడా పెరిగాయి. అలాగే  ప్రైవేటులో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ సక్రమంగా లేకుండా పోయింది. ఈ కారణాలతో సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయని 16వ గ్రామీణ వార్షిక విద్యా స్థితి నివేదిక.. ఆసర్‌.. తెలిపింది. దేశంలోని 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.  సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ రాష్ట్రాల్లో ఫోన్‌ ద్వారా ఈ సర్వే నిర్వహించారు.


ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్నందువల్ల విద్యా వ్యవస్థ క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని ఆసర్ నివేదిక తెలిపింది. కరోనా కాలంలో ముందు ఏదోలా ప్రాణాలు దక్కించుకుంటే చాలు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. అందుకే చాలా మంది ఆర్థిక స్థోమత లేక ప్రైవేటు నుంచి సర్కారు బడుల బాట పట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: