భారీ వర్షాలు... గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని వరదలు... రాయలసీమ ప్రాంతాన్ని మూడు రోజులు పాటు కుదిపేసిన వరుణుడు... ఇప్పుడిప్పుడే శాంతించాడు. నాలుగు రోజుల పాటు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో కాలం గడిపారు సీమ వాసులు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వరద నీటి నుంచి బయటకు వస్తున్నారు. తమకు జరిగిన నష్టం నుంచే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అన్నదాతలు లబోదిబో అంటున్నారు. ప్రజలు ఇళ్లల్లో సామాన్లతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. చివరికి కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల దివ్య క్షేత్రంపై కూడా వరుణుడు తన ప్రతాపం చూపాడు. తిరుమల కనుమ రహదారుల్లో కొండ రాళ్లు విరిగిపడ్డాయి. వరద నీరు మాఢ వీధులను ముంచేశాయి. చివరికి అలిపిరి మెట్టు దారి, శ్రీవారి మెట్ల మార్గాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మూడు రోజుల పాటు మూసేశారు కూడా. శ్రీవారి మెట్టు మార్గం వర్షాలకు పూర్తిగా ధ్వంసమైంది. కనుమ రహదారుల్లో మరమ్మతులను టీటీడీ అధికారులు వేగవంతం చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు తిరుమల, తిరుపతిలో కురిశాయని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు. గత 30 ఏళ్లలో ఇంత స్థాయిలో ఎప్పుడు వర్షం కురవలేదన్నారు. శేషాచలం కొండల్లోని అన్ని డ్యాములు కూడా పొంగిపొర్లుతున్నాయి. కపిల తీర్థం జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. తిరుపతి నగరం మూడు రోజుల పాటు వరద నీటిలో మునిగిపోయింది. భారీ వర్షాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటి వరకు ఏకంగా 5 కోట్ల రూపాయలు మేర నష్టం వచ్చినట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  మొదటి ఘాట్ రోడ్డులో నాలుగు చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయని... అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ పూర్తిగా కూలిపోయిందన్నారు. తాత్కాలిక రక్షణ చర్యలను చేపట్టినట్లు తెలిపారు. అటు రెండవ ఘాట్ రోడ్డులో 13 చోట్ల కొండ రాళ్లు పడ్డాయన్నారు. ఘాటు రోడ్డులో ఏర్పాటు చేసిన రక్షణ గోడలు  మొత్తం ఐదు చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కొండపై నారాయణగిరి గెస్ట్ హోస్‌ వద్ద మూడు వసతి గదులు దెబ్బతిన్నాయన్నారు. త్వరలోనే శ్రీవారి మెట్టు మార్గం  మరమ్మతులు చేసి.. భక్తులను అనుమతిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: