ఓ పక్క రాష్ట్రం వరదలతో కొట్టుమిట్టాడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం అసెంబ్లీలో పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాయలచెరువు విషయంలో ప్రభుత్వం విఫలం చెందింది అని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో పొగిడించుకుంటున్నట్టు విమర్శించారు. ఇక్కడ ప్రజల ఆర్తనాదాలు.. అక్కడ పొగడ్తలు. వరద బాధితులు తిండిలేక ఇబ్బంది పడుతుంటే.. వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు అన్నారు.
జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించిందని చంద్రబాబు ఆరోపించారు. భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినా.. కడప జిల్లాలోని పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులపై ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని ప్రశ్నించారు. ముందే నీళ్లు వదిలేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావనీ.. సమర్థతతో పనిచేస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు.
అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి 5లక్షల రూపాయలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
ఇదిలా ఉంటే.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పుడున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి.. రేపు తీరం దాటనుంది. దీంతో ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.