ఇప్పటికీ ఈటెలకు టీబీజేపీ ఇస్తున్న గౌరవం అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఆయన అవేవీ పట్టించుకోవడం లేదు. ఇక రఘునందన్ కూడా అంతే! ప్రచారంలో చెప్పిన విధంగానో మరో విధంగానో దుబ్బాకలో అభివృద్ధికి ఆయన కృషి చేయకుంటే, అందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోతే తప్పకుండా ఆయన రేపటి వేళ ప్రజల నుంచి తీవ్ర పరాభవం అందుకోక తప్పదు. అదేరీతిన అరవింద్ ధర్మపురి అనే నిజామాబాద్ ఎంపీ కూడా! ఇప్పటికే కేసీఆర్ ని తిట్టి తాను మీడియాలో హైలెట్ కావడం బాగున్నా, నియోజకవర్గ అభివృద్ధి చేయకుండా ఉంటే కవితకు పట్టిన గతే ఈయనకూ పట్టక తప్పదు. ఇక టీపీసీసీ కూడా నిన్నటి కన్నా బాగా పనిచేసేందుకు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిందే. ఇవేవీ జరగకుంటే మళ్లీ గులాబీ దండు అధికారం అందుకుని వీళ్లందరిపైనా జోకులు వేయడం ఖాయం.
వచ్చే ఎన్నికలకు నిన్న జరిగిన ఉప ఎన్నికలకు మధ్య ఏదో అగాధం అయితే ఉంది. అలా అని ఆ అగాధాన్ని మూసివేయడం అన్నది అన్నంత అనుకున్నంత సులువు పని కాదు. ఆ మాటకు వస్తే ఏ పనీ అంత సులువు కాదు. ప్రజలను గెలుపు దిశగా నడిపించడం, పాలకులు గెలుపు దిశగా నడవడం అన్నవి అంత సులువు కావు కదా! మరి! తెలంగాణలో ఏం జరుగుతోంది. ఇంటి పార్టీకే అన్నీ అనుకూలం అయితే వార్ ఏమౌతుంది వన్ సైడ్ అయి ఉంటుంది. అప్పుడు యుద్ధం చేయకుండా ఉన్న లేదా ఉండాలనుకుంటున్న వారు ఏమౌతారు.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉంటారు. లేదా పాలక పక్షంకు లోపాయికారిగా మద్దతు ఇచ్చి బయట మాత్రం నీతులు వల్లెవేసే సంబంధిత పార్టీలకు చెందిన ద్రోహులుగా గుర్తింపు పొందుతారు.
అలా కాకుండా పార్టీలు ఇచ్చిన నియమాలు అనుసరించి పనిచేస్తే అప్పుడు వారికి జనంలో గుర్తింపు తో పాటు ముందున్న కాలంలో అధికారమూ దక్కుతాయి. కానీ మన నాయకులు అనగా జాతీయ పార్టీల నాయకులు ఈ విధంగా ఉన్నారా లేదా? అంటే పార్టీ ఏం చెబితే అది..అధిష్టానం ఏమంటే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నకు సంకేతం.