భారత్ లో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై ప్రధాని  మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకమరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన కారణంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

సౌతాఫ్రికాలో ప్రమాదకరమైన కొత్తరకం కరోనా వేరియంట్ వెలుగు చూడటంతో పాటు.. కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూరప్, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బోట్స్ వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ ల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇక కరోనా కొత్త వేరియంట్ పై కేంద్రం హెచ్చరికల కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఎక్కడి నుంచైనా.. మహారాష్ట్రకు వచ్చేవారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకొని ఉండాలని.. లేకపోతే 72గంటల ముందుగా టెస్ట్ చేయించగా.. వచ్చిన కోవిడ్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని చెప్పింది.

మరోవైపు కరోనా కొత్త వేరియంట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు భేటీ కానున్నారు. అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించనుండగా.. కొత్త వేరియంట్ కేసులు ఉన్న దేశాల నుంచి రాకపోకలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతర్జాతీయ ప్రయాణీకుల ట్రేసింగ్, టెస్టింగ్ పై మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసే అవకాశముంది. ఇక దేశంలో గత 24గంటల్లో 9లక్షల 69వేల 354 కరోనా టెస్టులు చేయగా.. 8వేల 318మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిన్న కరోనాతో 465మంది ప్రాణాలు కోల్పోయారు.









మరింత సమాచారం తెలుసుకోండి: