ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్ విషయంలో అలర్ట్ గా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. దేశంలో ఓమిక్రాన్ కేసులు ఇంకా నమోదు కాలేదని తెలిపారు. ఎయిర్ పోర్టులో కరోనా టెస్టులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్సువానా నుంచి వచ్చే వారికి హోం ఐసోలేషన్ ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కొంటున్నామన్నారు. కరోనా కట్టడికి 2డోసుల వ్యాక్సిన్లు తప్పనిసరన్నారు. రెండవ డోస్ టీకా కోసం జనం ముందుకు రావడం లేదని మంత్రి తెలిపారు.
అవును నిజంగానే.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ పై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భయాలతో ప్రజలు రిస్క్ ఎందుకని టీకా కేంద్రాలకు పరుగెత్తుతున్నారు. గత రెండు రోజులుగా రెండో డోసు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బెంగళూరు, మైసూర్, ధర్వాడ్ లో సంప్రదాయ వేడుకలు, సమావేశాలు నిర్వహించవద్దని తెలిపింది. కేరళ, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారు తప్పనిసరిగా 72గంటల్లోపు చేయించిన ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలని.. నెగటివ్ వస్తే 7రోజులు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.