కొన్ని దేశాల్లో అత్యంత ప్రమాదకరమైన ఓమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ ఓ సూచించింది. పండుగలు, ఇతర వేడుకలు కోవిడ్ నిబంధనలు లోబడి నిర్వహించుకోవాలనీ.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని చెప్పింది. ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలంటోంది. వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇక కరోనా వ్యాక్సినేషన్ లో గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో 100శాతం జనాభాకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. 90.18శాతం జనాభాకు రెండు డోసుల టీకా అందిందని చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 18లక్షల 2వేల 32 డోసులు వేశామని పేర్కొంది. అయితే యూఏఈలో ఇప్పటి వరకు 7.41లక్షల కరోనా కేసులు రాగా.. 2వేల 145మంది మరణించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా అప్రమత్తమైన ప్రభుత్వం.. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు 72గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాలంది. ఎయిర్ పోర్ట్ లో ల్యాండయ్యాక మళ్లీ పరీక్షలు చేస్తామంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయేల్, హాంకాంగ్, బెల్జియం దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేయనున్నారు.