సౌతాఫ్రికాలో బయటపడిన కొత్త రకం కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యుడు.. వైరస్ బాధితుల్లో కనిపించే లక్షణాలను వెల్లడించారు. విపరీతమైన అలసట, తేలికపాటి కండరాల నొప్పులు, గొంతులో గరగర, పొడిదగ్గు లాంటివి ఒమిక్రాన్ లక్షణాలని ఆయన చెప్పారు. వైరస్ సోకిన వారిలో 40ఏళ్ల లోపు పురుషులే ఎక్కువగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతున్న దక్షిణాఫ్రికా నుంచి గత మూడు రోజుల్లో హైదరాబాద్ కు 185మంది ప్రయాణీకులు వచ్చారు. అలాగే బోట్స్ వానా దేశం నుంచి 16మంది.. కొత్త వేరియంట్ కేసులున్న 12రిస్క్ దేశాల నుంచి కొందరు ప్రయాణీకులు హైదరాబాద్ లో దిగారు. వీరికి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయగా.. వారిలో 11మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనుండగా.. ఆ పరీక్షల్లో అది ఏ వేరియంట్ అనేది తేలనుంది.

ఇక సౌతాఫ్రికా నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని థానేలో ఈ కేసు వెలుగు చూడగా.. వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ కు పంపించారు. అతనికి సోకింది ఏ వేరియంట్ అనే విషయం తెలుసుకునేందుకు ఆ వ్యక్తి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపించారు. ప్రమాదకర వేరియంట్ ఒమిక్రాన్ సౌతాఫ్రికాలోనే వెలుగు చూసిన క్రమంలో ఆ దేశం నుంచి వచ్చే వారిపై అన్ని దేశాలు నిఘాపెట్టాయి.

మరోవైపు సౌతాఫ్రికా నుంచి ఇటీవల కర్ణాటకకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. వాళ్లకు సోకింది ఒమిక్రాన్ కాదనీ.. డెల్టా వేరియంట్ అని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. వాళ్లలో ఒకరికి డెల్టా వేరియంట్ కు భిన్నమైన వేరియంట్ సోకిందని.. అది ఒమిక్రాన్ అని చెప్పలేమని తాజాగా వెల్లడించింది.  





మరింత సమాచారం తెలుసుకోండి: