రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉంటే సహజంగానే వేర్వేరు అభిప్రాయాలు, నిర్ణయాలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతుంటాయి. కొన్ని సార్లు రెండు చోట్ల కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంటే కూడా ఒకే అంశం పై వేర్వేరు ప్రకటనలు వెలవడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వేత్తలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పలుకులనే తిరిగి వల్లిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వరద దెబ్బతిన్న ప్రాంతాలలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో దఫా నేరుగా పర్యటిస్తున్నారు. వరద తాకిడి గురైన ప్రాంతాలలో కలియదిరుగుతున్నారు. వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య, పింఛా డ్యాంలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కనీవినీ ఎరుగని రీతిలో స్థానికంగానూ, ఎగువ ప్రాంతాలలోనూ వర్షాలు కురవడంతో డ్యాంలోకి రెండు రెట్లు నీరు ఓకే సారి చేరిందని ఫలితంగా డ్యాం దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి పేర్కోన్నారు. వెంటనే డ్యాంలను రీడిజైన్ చేయిస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని తిరిగి నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన వరదల కన్నా ముడు నాలుగు రెట్లు వరదలు వచ్చినా డ్యాంలు తట్టుకునే సామర్థ్యం ఉండేలా వీటిని నిర్మిస్తామని తెలిపారు.
దాదాపు అదే సమయంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన డ్యాం సేప్టీ బిల్లుపై చర్చ జరుగుతోంది. సభకు హాజరైన సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య డ్యాం జరిగిన నష్టాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. సభ్యుల ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో వరస వెంబటి తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయన్నారు. స్థానికంగానూ, ఎగువ ప్రాంతాలలోనూ అంచనాలకు మించి వర్షం కురిసిందన్నారు. దీంతో అన్నమయ్య డ్యాంకు వరద పోటు ఎక్కువైందని తెలిపారు. స్పిల్ వే సామర్థ్యాన్ని మించి వరదలు రావడంతో డ్యాం తెగిపోయిందని, డ్యాం సేప్టీ బిల్లు సభ ముందున్నప్పుడే భారత్ లో నలభైకి పైగా డ్యాం లు తెగిపోయి ఉన్నాయని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య డ్యాం పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒకే మాట మాట్లాడం ఆటు పార్లమెంట్ సభ్యులను, పరిశీలకులను ఆశ్చర్య పరచింది.