మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు సీఎస్.. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన ఓ యువతి అధికారులను కంగారు పెట్టించింది. హైదరాబద్ లోని కుత్బుల్లాపూర్ కు చెందిన ఓ యువతికి కరోనా అని తేలింది. దీంతో అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. తప్పించుకొని పారిపోయింది. దీంతో గాలింపు చేపట్టగా.. ఆమె అడ్రస్ ప్రూఫ్ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. తర్వాత ఆ యువతి టిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఒమిక్రాన్ కేసులు నమోదైన కారణంగా ఇలాంటి ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి.
ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రదేశం గురుకుల పాఠశాలలో ఈ రోజు 584మందికి టెస్టులు చేయగా.. మరో 19మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల్లో 46మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ భయంతో కొందరు బాలికలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా ముత్తంగి, ఖమ్మం జిల్లా వైరాలోని గురుకులాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి.