అహం శివం ఇక్కడి నుంచి
అయం శివం ఇక్కడి వరకూ
ధ్యానం శివం మనలో
శ్లోకం శివం మన నుంచి
ఇంకా.. కృతి శివం ప్రతి కృతం శివం
అఖండం అనంతం అమేయం శివం
నాకు తెలిసి పిల్ల కాలువ అని ఎవరిని ఉద్దేశించి అన్నా కూడా బాగుంది డైలాగ్.. అంతటి స్థాయిలో సినిమా అంతటా మోగింది డైలాగే! సీమ కష్టాలు, తెలంగాణ ప్రేమలు ఈ విధంగా అన్నింటినీ చూపించిన పద్ధతి బాగుంది. బాగుండడం అన్నది ఒక చిన్న మాట. ఇంకొంచెం సీన్లు పెంచి రాయాల్సింది. నువ్వు చేస్తే చట్టం నేనే చేస్తే ధర్మం అన్న డైలాగ్ ఇంకా బాగుంది.. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ చాలవు.. కథను విస్తృతం చేసి హింసకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచి సినిమా అఖండ.. ఇంతకుమించి ఏం చెప్ప కూడదు.
శబ్దానికీ శాసనానికీ మధ్య నడవడి అఖండ. ప్రకృతికీ పరమేశ్వర తత్వానికీ మధ్య నడవడి అఖండ. బాలయ్య అనే ఓ పెద్ద తరంగం వచ్చి పలికిన సంభాషణ లేదా పలికించిన ధ్వని లేదా వినిపించిన ఢమరుక ధ్వని అఖండ. ఆయన మాత్రమే అని చెప్పడంలో అతి లేదు. కానీ కథలో చాలా చెప్పాల్సింది. కానీ చెప్పలేదు. ఆయన మాత్రమే అని అనడంతో అతి లేదు. కానీ యూరేనియం తవ్వకాలకు అనుసంధానించి చెప్పాల్సిన కథ. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇలాకాలో జరుగుతున్న తవ్వకాలకు అనుసంధానిస్తూ చెప్పాల్సిన కథ. ఇప్పుడు ఆగిన కథ.. నల్లమలలో రేపో మాపో తవ్వకాల పేరిట మొదలయ్యే కథ. విధికి విశ్వానికి సవాళ్లు ఇవ్వ కూడదు అని చెప్పిన కథ..ఎదురెళ్ల కూడదు అని చెప్పిన కథ. గమన గమ్య రీతులకు బాలయ్య హీరో యిజం అడ్డు వచ్చింది.. బోయపాటి కాస్త దృష్టి పెట్టి రాస్తే ఈ కథకు కొరటాల లాంటి వారు జతకలిస్తే.. జగత్తునేలే కథే! కానీ కాలేదు. కానీ ఈ సినిమాకు బోయపాటి పనితనం కన్నా ఎం రత్నం మాటలే చాలా బాగున్నాయి. చాలా కాలం ఆ విజయేంద్ర ప్రసాద్ కాంపౌండ్ లో ఉండి సరయిన గుర్తింపు లేని రచయిత ఈయన.. ఈ సినిమా ఆయన మార్కు డైలాగ్ కు ప్రత్యేకం. ఆ విధంగా ఈ థియేటర్లలో పూనకాలు వస్తున్నాయి అంటే అందుకు కారణంగా ఆయనొక్కడే... మిగిలిన టెక్నీషియన్లు కథ కాకరకాయి అవి నాకు తెలియదు నేను చెప్పను.
మంచి కథను నడిపించే శక్తి.. బాలయ్య.. ఒకటి నిజం బాలయ్య రెండు అబద్ధం అది కూడా బాలయ్యే! అఖండ అనే పాత్రతో పరిణితికి ప్రాధాన్యం ఇచ్చారు బాలయ్య. నటనలో పరిణితి.. సంభాషణలో పరిణితి. ఆయన మాత్రమే చేయగలరు అని చెప్పగలిగితే అదే పరిణితికో ప్రామాణికం. ఇట్స్ ఎ ఒన్ కైండ్ పారామీటర్ ఫర్ దట్. అన్నింటికీ శివుడే ఆధారం. విలయాల్లో విలాపం శివుడిదే దుఃఖం శివుడు.. దుఃఖ నాశనం శివుడు. ప్రకృతి శివుడు ప్రళయం శివుడు. భారతీయత ఉన్న కథ. బాలయ్యకు నప్పిన కథ అఖండ.
- రత్నకిశోర్ శంభుమహంతి