ఇక భారత్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గుజరాత్ లో జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. అందులో ఒకరికి ట్రావెల్ హిస్టరీ లేదు. మరొకరు తిరిగి సౌతాఫ్రికా వెళ్లిపోయారు.
మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తో సౌతాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఆ దేశానికి వెళ్లింది. ఈ బృందం ఒమిక్రాన్ వేరియంట్ కు కేంద్రమైన గౌటెంగ్ ప్రావిన్స్ లో కేసుల్ని పర్యవేక్షించనుంది. బాధితుల ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తించి పరీక్షలు చేయనున్నారు. సౌతాఫ్రికాలోని ఒమిక్రాన్ కేసుల్లో 80శాతం గౌటెంగ్ లోనే వచ్చాయి. ఈ బృందం నివేదిక ఆధారంగా.. ఒమిక్రాన్ ప్రభావంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇక ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఓ వైపు ప్రపంచ దేశాలు వణికిపోతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్ పెట్టుకోకుండానే బయటకు వెళ్తున్నారట. దేశవ్యాప్తంగా 364జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. మన దేశంలోకి ఒమిక్రాన్ ఇప్పటికే ప్రవేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ ను అడ్డుకోవడం ప్రభుత్వాలకు సవాల్ తో కూడుకున్న పనే.