మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం ఎప్పుడు ఎలా ? మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఆయన ప్రతి ఎన్నికకు ఒక పార్టీ మారుతూ ఉంటారు.. అలాగే ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారటం కూడా ఆయనకు ఆనవాయితీగా వస్తోంది. 1999లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన గంటా అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికలలో అన‌కాప‌ల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గం మారి భీమిలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలోని నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా గంటా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఆయన పార్టీ మార‌తారనే ప్రచారం జరిగినా కూడా వాటిని ఖండించలేదు. ఇక ఇప్పటికే పలు పార్టీలు మారిన గంటా మళ్లీ పార్టీ మారే విషయంలో కాస్త గంద‌ర గోళంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మధ్యలో ఆయన టిడిపి కి దూరం అవుతారన్న ప్రచారం జరిగినా ... ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పోస్టుల్లో కూడా చంద్రబాబు ఫోటో పెట్టుకుంటున్నారు. అంటే తాను టీడీపీలోనే ఉంటానని చెబుతున్నట్టు కనిపిస్తుంది.

అయితే టిడిపి క్యాడర్ కు మాత్రం గంటా విష‌యంలో ఏ మాత్రం నమ్మకం లేదు. ఇక వచ్చే ఎన్నికలకు ముందు కూడా ఆయన అప్పటి రాజకీయ వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్‌ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన పై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అక్కడ టిడిపి ఓడిపోయింది.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి భీమిలి నియోజకవర్గానికి వెళ‌తార‌న్న‌ ప్రచారం జరుగుతోంది. మరి గంట వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ?నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: