రెవెన్యూ మంత్రి హోదా ఉమ్మడి రాష్ట్రంలో
ఆయనేం చెబితే అదే జరిగేది ఆ సమయంలో
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ ఓ నియోజకవర్గానికి
ఓ రహదారి మంజూరు విషయంలో కూడా
జగన్ ఆయన మాట వినడం లేదు అన్నది ఓ వాస్తవం
ఎందుకని? సీనియర్లకు విలువ ఇవ్వకుండా ఎన్నాళ్లు రాజకీయం చేస్తారని?
ముగ్గురు ముఖ్యమంత్రులు వరుసగా ఆయన మాట విన్నారు. వైఎస్సార్ అయితే తన క్యాబినెట్ లో రెండో స్థానం ఇచ్చి గౌరవించారు. రోశయ్య కూడా అంతే! వైఎస్సార్ మరణం తరువాత తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పెద్దల నిర్ణయం అనుసారం ముఖ్యమంత్రి పదవిలో కూర్చొన్నా, మంత్రి వర్గం కూర్పు మాత్రం మార్చలేదు. అప్పుడు కూడా ధర్మానకు మంచి వెయిట్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటల్లో సాధ్యా సాధ్యాలుచూసి విచారించి అమలు చేసేందుకే ఇష్టపడ్డారు. తరువాత సీఎం పీఠం అధిరోహించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ధర్మానకు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా జగన్ మాత్రం ధర్మానను పట్టించుకోరు.
కొన్ని కారణాల రీత్యా ఆయనను పక్కనబెట్టేశారు. బొత్సకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే ధర్మానకూ పదవి ఖాయం అని అనుకున్నా కూడా అది నిజం కాలేదు. త్వరలో చేపట్టే క్యాబినెట్ విస్తరణలో కూడా ధర్మానకు అస్సలు ఛాన్సే లేదు. అందుకే ఆయన పరోక్ష రీతిలో జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. వీటిపై వైసీపీ పెద్దలు పెద్దగా స్పందించకపోవడం వెనుక జగన్ ఉన్నారన్నది వాస్తవం. తాజాగా పీఆర్ ఇంజనీర్ల సమస్యపై కూడా ధర్మాన స్పందించిన తీరుపై విమర్శలు వచ్చినా కూడా కొన్ని విషయాలలో మాత్రం ఆయన చెప్పేవి జగన్ వింటే మంచి పాలనకు దారి సుగమం అయ్యేది.
వాస్తవానికి జగన్ తీరు కారణంగానే పాలన గాడి తప్పడానికి కారణం అని కూడా అంటున్నారు సీనియర్లు. ఎందుకంటే సలహాలు ఎవరు ఇచ్చినా సరే అవి వినిపించుకోకపోవడం ఓ కారణం కాగా., ఒకవేళ అమలు చేసే సలహాలు కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోతున్నాయి. మూడు రాజధానుల సలహా కూడా ఇలాంటిదేనని, ప్రభుత్వాన్ని పూర్తి ఇరకాటంలో నెట్టేసిన ఈ సలహా కారణంగానే జగన్ కు ఇన్ని ఇబ్బందులు అని, వాస్తవానికి పాదయాత్రలో ఆయనకు ఈ ఆలోచనే లేదని ఇప్పటికీ కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. న్యాయ వ్యవస్థ పరంగా ఈ బిల్లుకు ముందున్న కాలంలోనూ ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరుణాన రాజధాని నిర్ణయానికి సంబంధించి ధర్మాన మద్దతు ఇచ్చి మాట్లాడినా కూడా ఆయనకు తరువాత కాలంలో ఇవ్వాల్సినంత విలువ ఇవ్వలేదన్నది జగన్ పై వినిపిస్తున్న ఓ ఆరోపణ. సీనియర్లను ఎవ్వరినీ దగ్గరికి రానీయక ఒక్కరే అంతా అయి పార్టీని నడపడం వల్ల ముందున్న కాలంలో తమకూ సమస్యలు తప్పవనే అంటున్నారు ఇంకొందరు వైసీపీ నాయకులు.