దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న కారణంగా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పై కేంద్రం దృష్టి సారించింది. అయితే ఇప్పటికే కొవిషీల్డ్ బూస్టర్ డోసు అనుమతికి సీరం ఇన్ స్టిట్యూట్ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. దీంతో కొవిషీల్డ్ బూస్టర్ డోసుకు అనుమతి ఇచ్చే విషయమై నేడు ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఒమిక్రాన్ తన గమనాన్ని మార్చగలదని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, అసాధారణ మ్యుటేషన్లు కలిగిన ఒమిక్రాన్ భారీ ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. డెల్టా కంటే స్వల్ప లక్షణాలే ఉన్నట్టు తెలుస్తోందని.. ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం.. కట్టడి చర్యల వల్ల సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చన్నారు.

ఇక మహారాష్ట్రలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి నెగెటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. నవంబర్ 24న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 33ఏళ్ల మెకానికల్ ఇంజినీర్ కు తాజాగా జరిపిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందనీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్య వంశీ తెలిపారు. ఏడు రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించామన్నారు. అయితే మహారాష్ట్రలో 10ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.

మరోవైపు కరోనా టీకాల్లో తెలంగాణ మరో మైలు రాయిని అందుకుంది. ఇప్పటి వరకు నాలుగు కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తయింది. రాష్ట్ర జనాభాలో 18ఏళ్లు నిండిన 94శాతం మందికి ఫస్ట్ డోస్.. 50శాతం మందికి సెకండ్ డోస్ అందిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారం, గైడెన్స్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. మిగతా కోటి డోసుల పంపిణీని మరో నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. అయితే కొవిషీల్డ్ బూస్టర్ డోస్ పై నేడు నిర్ణయం రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: