ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. PRCపై ప్రకటన చేయనున్న కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా సీఎంను కలిసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల.. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా సీఎం.. ఉద్యోగ సంఘాలతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

14.29శాతం ఫిట్ మెంట్ వల్ల ఉద్యోగులకు నష్టం ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికే 27శాతం ఐఆర్ ఇస్తున్నామనీ చెప్పారు. 14.29శాతం పీఆర్సీతో ఐఆర్ కంటే ఎక్కువగా లబ్ది కలుగుతుందన్నారు. ఉద్యోగులు కోరే 45శాతం ఫిట్ మెంట్ సాధ్యం కాదనీ కమిటీ చెప్పిందన్నారు. కరోనాతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతోనూ చర్చించే అవకాశముందన్నారు.

మరోవైపు సీపీఎస్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు సెక్యూరిటీ ఎలా అని ఆలోచించే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారనీ.. దానిపై టెక్నికల్ విషయంలో ఆలోచించలేదన్నారు. సీపీఎస్ కోసం మొత్తం రాష్ట్ర బడ్జెట్ అయినా సరిపోయే పరిస్థితి లేదని చెప్పారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు సజ్జల.

ఇక సచివాలయం సంఘంలా తాము 34శాతం ఫిట్ మెంట్ కు ఒప్పుకునేది లేదనీ.. 55శాతం ఇస్తేనే అంగీకరిస్తామని జేఏసీ నేత బొప్పరాజు స్పష్టం చేశారు. ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చే సంప్రదాయం కొనసాగించాలన్నారు. తమ అభిప్రాయాలు, ఆవేదనను సజ్జలకు స్పష్టంగా చెప్పామని తెలిపారు. 14.29శాతం ఫిట్ మెంట్ ను రెండు జేఏసీలు వ్యతిరేకించాయని చెప్పారు.మరోవైపు రివర్స్ పీఆర్సీ రాష్ట్రంలోనే తొలిసారి చూస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఐఆర్ 27శాతం ఉంటే.. 14శాతం చాలని నివేదిక ఇస్తారా అని ప్రశ్నించారు. జీతాలు పెంచాలంటే తగ్గిస్తామంటున్నారనీ.. ఆర్టీసీ విలీనం, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థతో ఖజానాపై భారం పడిందన్నారు.  

 




మరింత సమాచారం తెలుసుకోండి: