ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కట్టడికి ఆరోగ్యశాఖ 5సూత్రాల ప్రణాళికను సిద్దం చేసింది. విమానాశ్రయాల దగ్గరే బాధితులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 100శాతం వ్యాక్సినేషన్ ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. వ్యాక్సినేషన్ తో పాటు, మాస్క్ పెట్టుకోవడంపై అవగాహన పెంచేందుకు సిద్దమవుతోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇంటింటి సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి కొవిడ్ టెస్ట్ చేసేందుకు పూనుకుంది ఏపీ ఆరోగ్య శాఖ.

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 27మందికి కరోనా సోకింది. అయితే ఇది ఒమిక్రానా..? కాదా అనేది తేలాలి. వీరితో సన్నిహితంగా ఉన్న మరో తొమ్మిది మంది కూడా వైరస్ బారిన పడగా.. తొలిసారి కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చి.. ఆ తర్వాతి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినవారు ఎనిమిది మంది ఉన్నారు. ఈ నెల 1నుంచి ఇప్పటి వరకు 26వేల మంది వచ్చారని.. వీరిలో వెయ్యి మంది ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కొత్త వేరియంట్ మొత్తం బాధితుల సంఖ్య 20కి చేరింది. విదేశాల నుంచి తాజాగా రాష్ట్రానికి వచ్చిన 12మందిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. వీరిలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరాతీశారు. వైద్యారోగ్యశాఖ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందనీ.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఇక ఈ నెల 22లోగా కరోనా తొలి డోసు వ్యాక్సినేషన్ ను 100శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాలు కలిపి 98శాతం మందికి తొలి డోసు ఇవ్వగా.. 16జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. 3జిల్లాల్లో 99శాతం వ్యాక్సినేషన్, 8జిల్లాల్లో 90శాతానికి పైగా.. 6జిల్లాల్లో 90శాతం లోపు వ్యాక్సినేషన్ జరగ్గా.. కరీంనగర్ జిల్లాలో 82శాతం మందికి రెండో డోసు కూడా ఇచ్చారు.










మరింత సమాచారం తెలుసుకోండి: