ఒమిక్రాన్ లక్షణాలు తెలుసుకునేందుకు యూకేలో కోవిడ్-19 ట్రాకింగ్ స్టడీస్ పేరుతో ఓ అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో ముక్కు కారడం, తలనొప్పి, అలసట, గొంతులో మంట తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రధాన లక్షణాలన్నీ సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉన్నాయని చెప్పారు. ఇతర వేరియంట్ల మాదిరిగా ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, వాసన, రుచిని కోల్పోవడం లాంటి లక్షణాలు కన్పించలేదన్నారు.

ఇక యూరప్ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. అత్యధిక కేసులు నమోదవుతుండటంతో నెదర్లాండ్స్ లో నేటి నుంచి జనవరి 14వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని మార్క్ రట్ ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర దుకాణాలు మినహా మిగతావన్నీ మూతపడనున్నాయి. పండగలు, పంక్షన్ ల పైనా ఆంక్షలు విధించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇళ్లలో ఎక్కువ మంది జనం గుమికూడవద్దని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటి వరకు 89దేశాలకు వ్యాపించినట్టు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. ఈ వేరియంట్ సోకిన ప్రాంతాల్లో కేసులు రెండు, మూడు రోజుల్లోనే రెట్టింపవుతున్నట్టు వెల్లడించింది. దీని కట్టడికి గ్రామస్థాయిలోని ప్రజారోగ్య చర్యలు మరింత ముమ్మరం చేయాలని సూచించింది. ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నా.. కేసుల సంఖ్య పెరిగితే ఆస్పత్రులపై మళ్లీ ఒత్తిడి పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇక బ్రిటన్ లో లాంటి పరిస్థితి తలెత్తితే మన దేశంలో మన జనాభా ప్రకారం రోజుకు 14లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. బ్రిటన్ లో వ్యాక్సిన్ వేసుకున్న వారిలోనూ కరోనా డెల్టా, ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని పేర్కొంది. ఆఫ్రికాతో పాటు యూరప్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. అలాంటి పరిస్థితులు దేశంలో రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది. మరి ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












మరింత సమాచారం తెలుసుకోండి: