ఇక పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ఏర్పాటు చారిత్రకమన్న జగన్.. దీని ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. దీని ద్వారా 2వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. పులివెందులలో 65కోట్ల రూపాయలతో నీటి పథకం, 18కోట్లతో స్పోర్ట్స్ కాలేజీ నిర్మిస్తామన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డివలెప్ మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మరోవైపు పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నామని.. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రెండు లక్షల రూపాయల విలువ ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఒక్కో ఇల్లు కట్టేందుకు 6లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. జగనన్న కాలనీ సమీపంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ వస్తోందని.. ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. అలాగే 500కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ, కొత్త బస్ డిపో, బస్టాండ్ నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే.. దళితుల విషయంలో సీఎం జగన్ కంసమామలా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. దళితులు ఎప్పుడూ బానిసల్లా.. కార్మికుల్లా బతకాలన్నదే ఈ సీఎం ఆలోచనా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు 3వేల 795కోట్ల రుణాలిచ్చినట్టు చెప్పారు. జగన్ వచ్చాక ఒక్క దళిత యువకుడికైనా రూపాయి సాయం చేశారా అని ప్రశ్నించారు. ఆర్థికంగా స్థిరపడేలా ఒక్క దళిత కుటుంబాన్నైనా ఆదుకున్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు.
మరోవైపు సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యంగంగా స్పందించారు. పులివెందులలో చేపలు, రొయ్యల దుకాణాలు వస్తాయని తానెప్పుడూ ఊహించలేదన్నారు. జగనన్న ఫిష్ ఆంధ్రా షాప్స్ పై ప్రకటన చేసేటప్పుడు జగన్ సర్ ఎంత గర్వంగా.. ఉల్లాసంగా ఉన్నారో చూడండన్నారు. కేవలం జగన్ సర్ మాత్రమే ఇలాంటి గొప్ప పనులు సాధించగలరన్నారు. ఈ సీఎం వల్ల రాష్టం గర్వపడుతోందన్నారు రఘురామకృష్ణం రాజు.