సొంత ఊరికి వ‌చ్చిన
సీజేకు మ‌న ప్ర‌భుత్వం
స‌ముచిత రీతిలో చేసిన
గౌర‌వం పై అంత‌టా
హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది
ఓ విధంగా మంచి ప‌రిణామం


మొద‌ట నుంచి మొండి వైఖరి అవ‌లంబించి వివాదాల‌కు కేరాఫ్ గా నిలిచిన వైఎస్సార్సీపీ స‌ర్కారు ఈ మ‌ధ్య కాస్త వెన‌క్కు త‌గ్గుతోంది. కోర్టులు,వాటి నిర్వహ‌ణ త‌దిత‌ర విష‌యాల‌పై గ‌తంలో ఎన్నో అభియోగాలు చేసిన జ‌గ‌న్ మ‌నుషులు మ‌న‌సు మార్చుకుని నిన్న‌టివేళ అత్యున్న‌త న్యాయాధికారిని ఆహ్వానించిన తీరు  వారిలో మార్పున‌కు తొలి సంకేతం అని అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ఇట్స్ ఎ గ్రేట్ ఛేంజ్ ....



చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ విష‌యంలో సీఎం వైఖ‌రి మారింద‌ని తెలుస్తోంది. నిన్న ఆయ‌న స్వ‌గ్రామం పొన్న‌వ‌రంకు విచ్చేసిన సంద‌ర్భంగా జిల్లా అధికారులతో పాటు ఏపీ మంత్రులు ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికిన తీరు, అదేవిధంగా ప్రొటొకాల్ ను పాటించిన విధానం బాగుంద‌న్న కితాబు వ‌చ్చింది. రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి, పేర్ని నాని లాంటి వారు ఆయ‌న‌కు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికిన తీరు, అదేవిధంగా ఆయ‌న‌ను స్వాగ‌తిస్తూ ప‌లు చోట్ల ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఇవ‌న్నీ కాస్తో కూస్తో వైఎస్ జ‌గ‌న్ లో వ‌చ్చిన మార్పే!



మొద‌ట నుంచి న్యాయ‌మూర్తుల నియామ‌కం పై ఎన్నో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌గ‌న్ త‌రువాత త‌గ్గారు. కొంద‌రు న్యాయ‌మూర్తులు జ‌గ‌న్ కు కిట్ట‌క పోవ‌డం వెనుక అస‌లు కార‌ణం వారంతా చంద్ర‌బాబు మ‌నుషులే అన్న ఆరోప‌ణ ఒక‌టి బాహాటంగానే చేయ‌డం. అంతేకాదు సోష‌ల్ మీడియా వేదిక‌ల్లోనూ త‌మ‌కు వ్య‌తిరేకంగా తీర్పులు వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ వైసీపీ వ‌ర్గాలు న్యాయ‌మూర్తుల ఇమేజ్ ను  త‌గ్గించేలా వ్యాఖ్య‌లు చేయ‌డం వాటిపై కోర్టులు సీరియ‌స్ అవ్వ‌డం వంటి పరిణామాలను అప్పుడే మ‌రిచిపోలేం. కానీ నిన్న‌టి వేళ జ‌గ‌న్ మొద‌ట నుంచి వ్య‌తిరేకిస్తూ వచ్చిన సీజే కు కాస్తో కూస్తో ఉన్న‌త స్థాయిలో,స‌ముచిత రీతిలో ఏపీ ప్ర‌భుత్వం ఆహ్వానించిన తీరు అయితే మాత్రం అనూహ్యం..అభినంద‌నీయం కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: